Temples ఆలయాలు మూసివేత
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:22 PM
Closure of Temples చంద్రగ్రహణం కారణంగా జిల్లాలో ప్రముఖ దేవాలయాను మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శనాలు నిలిపివేసి తలుపులకు తాళాలు వేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం
పాలకొండ/గరుగుబిల్లి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా జిల్లాలో ప్రముఖ దేవాలయాను మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శనాలు నిలిపివేసి తలుపులకు తాళాలు వేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. కాగా పాలకొండ కోటదుర్గ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 8 గంటలకు ఆలయం తెరవనున్నట్టు ప్రధాన అర్చకులు డి.లక్ష్మీప్రసాద్‌శర్మ, ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. చంద్ర గ్రహణం అనంతరం ఆలయంలో మహా సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, నవకలశస స్థాపన, హోమం అనంతరం భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నట్టు చెప్పారు. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవాలయాలు కూడా మూతపడ్డాయి. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచార్యులు ఉభయ ఆలయాల పరిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల సమయంలో హోమాలు నిర్వహించి ప్రధాన ఆలయాలకు చెందిన తలుపులను మూసివేశారు. సోమవారం ఉదయం గ్రహణ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో సూర్యనారాయణ తెలిపారు. సాలూరు పంచముఖేశ్వర ఆలయంలో లలితా హోమం నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. కాగా గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం తినరాదనే నమ్మకం ఉండడంతో ఏడున్నర గంటలకు చాలామంది భోజనాలు ముగించారు. గ్రహణం నేపథ్యంలో హోటళ్లు కొనుగోలుదారుల్లేక ఖాళీగా కనిపించాయి. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం వల్ల కుంభ, మకర, వృశ్చిక, సింహ, తుల రాశులు వారు చూడరాదని రుత్వికులు చెప్పారు.