Climbed Down the Hill.. కొండ దిగి.. ఆసుపత్రికి చేరి!
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:45 PM
Climbed Down the Hill.. Reached the Hospital! కొమరాడ మండలంలో ఏజెన్సీ ప్రాంతవాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
రోడ్డు సౌకర్యం లేక అవస్థలు
కొమరాడ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో ఏజెన్సీ ప్రాంతవాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిశిఖర గ్రామం కొత్తూర్‌కు చెందిన సురేష్ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగా సోమవారం ఉదయానికి ఆరోగ్యం బాగా క్షీణించింది. కాళ్లు, చేతులు వాచిపోగా, మాట్లాడలేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన డోలీ కట్టారు. స్వగ్రామం నుంచి సురేష్‌ను స్ర్టెచర్‌పై మోసుకుంటూ.. సుమారు నాలుగు కిలోమీటర్లు రాళ్లు, రప్పలు దాటి.. కొండ దిగి పూజారిగూడ గ్రామ సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఆటో అద్దెకు తీసుకుని 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కురుపాం ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం సురేష్‌ను 108 వాహనం సాయంతో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఐసీయూలో ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీ మోతలు తప్పడం లేదని, దీనిపై ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరారు.