చీకట్లో నగరం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:37 AM
జిల్లా కేంద్రం విజయనగరం అంధకారంలో మగ్గుతోంది. రాత్రి 7 గంటలైతే చాలు అనేక డివిజన్లలో చీకట్లు కమ్ముకుంటున్నాయి.
- విజయనగరంలో వెలగని వీధి దీపాలు
-దయనీయంగా సెంట్రల్ లైటింగ్
- కొరవడిన పర్యవేక్షణ
విజయనగరం రింగురోడ్డు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):జిల్లా కేంద్రం విజయనగరం అంధకారంలో మగ్గుతోంది. రాత్రి 7 గంటలైతే చాలు అనేక డివిజన్లలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాత్రి వేళ్లల్లో వీధి దీపాలు, సెంట్రల్ లైట్లు, హైమాస్ట్ లైట్లు వెలగకపోవడమే దీనికి కారణం. మొత్తం 50 డివిజన్ల పరిధిలో 19 వేల వీధి దీపాలు (ఎల్‌ఈడీలు), 2 వేల సెంట్రల్, హైమాస్ట్ లైట్లు ఉన్నాయి. ఇందులో 4 వేలకు పైగా ఎల్‌ఈడీలు, 300 పైగా సెంట్రల్, హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. కొత్తపేట, బంగారమ్మపేట, సాకేటి వీధి, పల్లివీధి, దాసన్నపేట, పూల్‌బాగ్ కాలనీ, ధర్మపురి, పద్మావతి నగర్, మంగళ వీధి, ఉడాకాలనీ, బాబామెట్ట, కంటోన్మెంట్ ఇలా చాలా డివిజన్లలో రాత్రుళ్లు వీధి దీపాలు వెలగక చీకట్లు కమ్ముకుంటున్నాయి. అదే విధంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి భాష్యం స్కూల్ జంక్షన్ వరకు, దాసన్నపేట రింగురోడ్డు, పూల్‌బాగ్, ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రదీప్ నగర్ రోడ్డు, వీటీ అగ్రహారం రోడ్డు, వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో సెంట్రల్ లైట్లు, హైమాస్ట్ లైట్లు వెలగని పరిస్థితి నెలకొంది. నగర సుందరీకరణలో భాగంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సెంట్రల్, హైమాస్ట్ దీపాలు నాణ్యతగా లేకపోవడంతో అవి కొన్ని రోజులే వెలుగుతున్నాయి. తరువాత మరమ్మతులకు గురవుతున్నాయి. అలాగే, వీధి దీపాలపై సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. అవి వెలుగుతున్నాయా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. వీధి దీపాల సమస్యలపై కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కమిషనర్ నల్లనయ్య దీనిపై దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏఈ సీహెచ్ స్రవంతిని వివరణ కోరగా.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.