Share News

లే చిన్నా.. ఇంటికెళ్దాం!

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:29 PM

Chinna... Let's Go Home! విద్యుత్‌ తీగలు యమపాశమయ్యాయి. నాలుగేళ్ల బాలుడిని బలితీసుకున్నాయి. కన్నవారికి తీరని శోకం మిగిల్చాయి. ఆడుకోవడానికి బయటకు వచ్చిన బాలుడు విద్యాదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది.

 లే చిన్నా.. ఇంటికెళ్దాం!
అఖిరానందన్‌(ఫైల్‌)

  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

  • యమపాశంగా వాటర్‌ ట్యాంకు విద్యుత్‌ బోర్డు వైర్లు

మక్కువ రూరల్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ తీగలు యమపాశమయ్యాయి. నాలుగేళ్ల బాలుడిని బలితీసుకున్నాయి. కన్నవారికి తీరని శోకం మిగిల్చాయి. ఆడుకోవడానికి బయటకు వచ్చిన బాలుడు విద్యాదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్‌.పెద్దవలస గ్రామానికి చెందిన కె.చందు, రమ్యా దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. నాలుగేళ్ల అఖిరానందన్‌ , 12 నెలల అక్షిత ఉన్నారు. కాగా రోజూలానే శుక్రవారం అఖిరానందన్‌ తన ఇంటికి సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఆడుకుంటూ బయటకు వచ్చాడు. అయితే స్థానిక సచివాలయం పక్కన వాటర్‌ ట్యాంకు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ బోర్డు వైర్లు తెగి కిందకు వేలాడుతూ ఉండగా.. అవి అనుకోకుండా బాలుడికి తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న తమ కుమారుడిని చూసి షాక్‌కు గురయ్యారు. ‘లే చిన్నా.. ఇంటికి వెళ్దాం’ అంటూ భోరున విలపించారు. అప్పటివరకు ఆడుకుంటూ.. ముద్దు ముద్దు మాటలతో సందడి చేసిన బిడ్డను తలుచుకుని కన్నీరుమున్నీరయ్యారు. వాస్తవంగా విద్యుత్‌ బోర్డు వైర్లు సరిచేయాలని ఎస్సీ కాలనీవాసులు గతంలో విద్యుత్‌ సిబ్బంది, స్థానిక సర్పంచ్‌కి ఫిర్యాదు కూడా చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. కాగా తమ కుమారుడి అకాల మృతికి విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘటనపై వారు ఫిర్యాదు చేయడంతో మక్కువ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:29 PM