నేడు ముఖ్యమంత్రి చంద్రబాబురాక
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:26 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. భామిని మోడల్ స్కూల్‌లో జరగనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో ఆయన పాల్గొననున్నారు.
- భామినిలో నిర్వహించే పీటీఎంకు హాజరు
- పాల్గొననున్న మంత్రి లోకేశ్
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
భామిని, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. భామిని మోడల్ స్కూల్‌లో జరగనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో ఆయన పాల్గొననున్నారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేశ్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాల ఆవరణలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యే వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్కూల్‌కు ఎదురుగానే హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.20 గంటలకు భామిని చేరుకుంటారు. 10.30 గంటలకు ఏపీ మోడల్‌స్కూల్, జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా పేరెంట్స్ సమావేశంలో పాల్గొంటారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 7,726 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 328 మంది, బాలికలు 398 హాజరుకానున్నారు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి దగ్గరుండి పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయి, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సంబంధించి ట్రయిల్ రన్ నిర్వహించారు. హోలీస్టిక్స్ ప్రో గ్రెస్ కార్డులో భాగంగా విద్యార్థులతో కలెక్టర్ లీప్ (సైగలు)ను ప్రాక్టికల్‌గా నిర్వహించారు. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దారి పొడవునా బాంబు స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
మూడో ముఖ్యమంత్రిగా..
భామిని మండలంలో అడుగుపెట్టనున్న మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలవనున్నారు. 1962లో నేరడి బ్యారేజీ శంకుస్థాపనకు అప్పటి సీఎం దామోదరం సంజీవయ్య హాజరయ్యారు. 1980లో వంశధారకు వచ్చిన వరదలకు తాలాడ గ్రామంలో అత్యధికమంది మృతి చెందడంతో బాధితులను పరామర్శించేందుకు ఆనాటి సీఎం అంజయ్య వచ్చారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నేరడి బ్యారేజ్ శంకుస్థాపనకు హాజరుకావాల్సి ఉండగా ఆ కార్యక్రమం ఆకస్మికంగా రద్దయింది. ఆయన హిరమండలంలో శంకుస్థాపన చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు అరెస్టును తట్టుకోలేక భామిని మండ లంలోని బిల్లుమడకు చెందిన ఓవ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బిల్లుమడకు వచ్చారు. టీడీడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో పర్యటిస్తారని అప్పట్లో భువనేశ్వరి అన్నారు. ఆ మేరకే మారుమూల మండలం ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం భామినికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారని, మాటకు కట్టుబడిన కుటుంబమని టీడీపీ శ్రేణులు సంతోషపడుతున్నాయి.