Share News

Chickens.. tears in the farmer's eyes కోళ్లు.. రైతు కంట కన్నీళ్లు

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:04 AM

Chickens.. tears in the farmer's eyes అంతుచిక్కని వ్యాధితో వారం రోజులుగా ఫారాల్లో పెంచుతున్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిన్నటివరకు బాగానే తిరుగాడిన కోడి ఉన్నట్టుండి నేలవాలిపోతోంది. కొత్తవలస పౌల్ర్టీ జోన్‌లో లక్షల్లో ప్రాణాలొదిలాయి. దీంతో వీటిని పెంచడం ద్వారా ఉపాధి పొందుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధిని నిర్ధారించేందుకు ఇప్పటికే కొత్తవలస పశు సంవర్ధకశాఖ అధికారులు నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపించారు.

Chickens.. tears in the farmer's eyes కోళ్లు.. రైతు కంట కన్నీళ్లు
కొత్తవలసలోని ఓ ఫారంలో మృత్యువాత పడిన బ్రాయిలర్‌ కోళ్లు

కోళ్లు.. రైతు కంట కన్నీళ్లు

అంతుచిక్కని వ్యాధితో మరణం

కొత్తవలస పౌల్ర్టీ జోన్‌లో లక్షల్లో ప్రాణాలొదిలిన వైనం

నమూనాలను ల్యాబ్‌కు పంపించామన్న అధికారులు

కొత్తవలస, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): అంతుచిక్కని వ్యాధితో వారం రోజులుగా ఫారాల్లో పెంచుతున్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిన్నటివరకు బాగానే తిరుగాడిన కోడి ఉన్నట్టుండి నేలవాలిపోతోంది. కొత్తవలస పౌల్ర్టీ జోన్‌లో లక్షల్లో ప్రాణాలొదిలాయి. దీంతో వీటిని పెంచడం ద్వారా ఉపాధి పొందుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధిని నిర్ధారించేందుకు ఇప్పటికే కొత్తవలస పశు సంవర్ధకశాఖ అధికారులు నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపించారు.

కొత్తవలస మండలంలోని తుమ్మికాపల్లి గేట్‌ దాటిన తరువాత వియ్యంపేట నుంచి కొత్తవలస, వేపాడ, లక్కవరపుకోట మండలాలతో పాటు అనకాపల్లి జిల్లా కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోళ్లఫారాలు కలిపి కొత్తవలస పౌల్ర్టీజోన్‌గా కొనసాగుతోంది. ఈ జోన్‌లో వియ్యంపేట, దేవాడ, రామలింగపురం, చీడివలస, ముసిరాం, కళ్లేపల్లి, రేగ, కుమ్మపల్లి దీక్షతుల అగ్రహారం, కొరువాడ, లంకవానిపాలెం, పిండ్రంగి, ఆనందపురం,దేవరాపల్లిపాటు వివిధ గ్రామాల్లో పౌల్ర్టీఫారాలను ఏర్పాటు చేసుకుని బ్రాయిలర్‌ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. కోళ్లను 45 రోజుల నుంచి 50 రోజుల వరకు పెంచాక ఎగుమతి చేసే సమయంలో ఈ అంతు చిక్కని వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నాయి.

పౌల్ర్టీలో చదరపు అడుగుకు ఒక కోడి చొప్పున పెంచు తుంటారు. కోళ్ల ఫారాలను నిర్వహిస్తున్న రైతులు స్నేహా, వెంకటేశ్వర, ఎస్‌ఆర్‌ వంటి హేచరీస్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం రైతులకు హేచరీస్‌ యజమానులు కోడిపిల్లలను(చిక్స్‌)ను పంపిణీ చేస్తారు. మేతను కూడా హేచరీస్‌ యజమానులే రైతులకు ఇస్తారు. రైతులు తమ కోళ్ల ఫారాలలో కోడిపిల్లలను 45 రోజుల నుంచి 50 రోజుల వరకు పెంచుతారు. ఫారాలు నిర్వహణ, లేబర్‌ చార్జీలు, విద్యుత్‌ వంటివి యజమానులే భరించాల్సి ఉంటుంది. కోళ్లు పెరిగిన తరువాత వీటిని హేచరీస్‌ సంస్థలకే తిరిగి ఎగుమతి చేస్తారు. ఇందుకు హేచరీస్‌ యజమానులు కేజీల లెక్కన లెక్క కట్టి డబ్బులను కోళ్ల ఫారాల యజమానుల అకౌంట్‌లలో జమ చేస్తారు. వారం రోజుల కిందట నుంచి కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడుతుండడంతో ఇటు కోళ్లను పెంచిన యజమానులు పూర్తిగా నష్టపోగా హేచరీస్‌ సంస్థల యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ వారం రోజులలో 8 లక్షల వరకు కోళ్లు మృత్యువాత పడినట్టు రైతులు చెబుతున్నారు. ఇప్పటికీ మృతి చెందుతునే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ల నుంచి రుణాలను తీసుకొచ్చి ఫారాలను ఏర్పాటు చేసుకుంటే ఈ అంతు చిక్కని వ్యాధి తమకు నష్టాలను తెచ్చి పెట్టిందంటున్నారు.

నమూనాలను ల్యాబ్‌కు పంపించాం

అంతుచిక్కని వ్యాధితో కోళ్లఫారాల్లో కోళ్లు చనిపోతున్నట్టు గత నెల 28 నుంచి మాకు రైతుల నుంచి సమాచారం వచ్చింది. వెంటనే వైద్యులతో గ్రామాలకు వెళ్లి మృత్యువాత పడుతున్న కోళ్లను పరిశీలించాం. నమూనాలను సేకరించి విజయవాడ ల్యాబ్‌కు పంపించాం. నిర్ధారణ జరిగాక చర్యలు తీసుకుంటాం.

- కన్నంనాయుడు, ఏడీ, కొత్తవలస పశుసంవర్ధకశాఖ

Updated Date - Sep 02 , 2025 | 12:04 AM