Chickens die from Ranikat disease రాణికట్ వ్యాధితోనే కోళ్ల మృతి
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:59 PM
Chickens die from Ranikat disease
రాణికట్ వ్యాధితోనే కోళ్ల మృతి
ప్రజారోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు
పశు సంవర్ధకశాఖ ఏడీ కన్నంనాయుడు
కొత్తవలస, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస పౌల్ర్టీజోన్‌లో కొద్దిరోజులుగా అంతుచిక్కని వ్యాధితో మృతి చెందుతున్న లక్షలాది కోళ్ల మృతికి రాణికట్ వ్యాధి సోకడమే కారణమని నిర్ధారణ అయిందని కొత్తవలస పశు సంవర్ధకశాఖ ఏడీ కన్నంనాయుడు తెలిపారు. కోళ్ల మృతికి బర్డ్‌ఫ్లూగాని, ఇన్‌క్లూజన్ హెపటైటిస్ వ్యాధి కాని సోకలేదని, దీనివల్ల ప్రజారోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ‘ఆంధ్రజ్యోతి’తో శనివారం మాట్లాడిన ఆయన కోళ్ల మృతికి కారణాలు వివరించారు. బాగా ఉడికించి మాంసం, గుడ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని స్పష్టం చేశారు. లక్షలాది కోళ్ల మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని కొంతమంది కోళ్లఫారాల రైతుల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బర్డ్‌ఫ్లూతో కోళ్లు మృతి చెందితే ప్రభుత్వమే కోళ్లఫారాలను స్వాధీనం చేసుకుని, అప్పటికి బతికి ఉన్న కోళ్లను చంపేసి, ఒక్కో కోడికి రూ.35 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. ఇప్పటికిప్పుడు మళ్లీ కోళ్లను పెంచకుండా కొద్ది రోజుల పాటు షెడ్‌లను ఖాళీగానే ఉంచాలని, ఆపై పశుసంర్ధకశాఖాధికారుల సలహాలు, సూచనలను పాటించాలని చెప్పారు.