Civil Supplies Department: ‘ఛీ’విల్ సప్లైస్
ABN , Publish Date - May 13 , 2025 | 11:25 PM
Civil Supplies Department: జిల్లాలో పౌరసరఫరాల శాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. తాజాగా, డీఆర్‌సీ సమావేశంలో మరోసారి ఇది చర్చకు వచ్చింది.
- అస్తవ్యస్తంగా పౌరసరఫరాల శాఖ
- వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యం
- ఇన్‌చార్జి అధికారిఅవినీతి
- ధాన్యం సేకరణ, రేషన్ సరుకుల్లో చేతివాటం
-విజిలెన్స్ విచారణకు మంత్రి అనిత ఆదేశం
గతేడాది డిసెంబరు 30న జిల్లాకు 25 టన్నుల (25 వేల కిలోల సంచులు) కంది పప్పు నిల్వలు లారీల్లో వచ్చాయి. దీనికి ముందు రోజే అవే లారీలు కందిపప్పుతో శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాయి. అక్కడ పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. నాసిరకం కందిపప్పు కావడంతో తిరస్కరించారు. కానీ, అవే వే బిల్లులతో వచ్చిన కందిపప్పు స్టాక్‌ను మన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తీసుకోవడం వెనుక భారీ మతలబు ఉంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కువగా రైస్ మిల్లులు ఆ పార్టీ నేతల గుప్పెట్లో ఉండేవి. 2023-24లో ఒక్క రైస్ మిల్లును తనిఖీ చేసిన పాపాన పోలేదు. దీంతో బస్తాకు 3 నుంచి 5 కిలోలు అదనంగా ఇస్తే కానీ ధాన్యం కొనుగోలు చేయలేమని మిల్లర్లు చెప్పేవారు. ఈ అక్రమాలను నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకునేవారు కాదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. జగన్ పాలనలో ప్రతి ఏటా ధాన్యం సేకరణ సమయంలోనే సుమారు రూ.40 కోట్లు దోపిడీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని ఓ వైసీపీ నేత.. రైస్ మిల్లుల్లో వచ్చిన కమీషన్‌తో ఊక వ్యాపారం మొదలు పెట్టాడు. జిల్లాలోని రైస్ మిల్లర్లంతా ఆయన చెప్పిన ధరకే ఊక ఇవ్వాలని, లేదంటే మీ మిల్లులపై సివిల్ సప్లైస్, విజిలెన్స్ తనిఖీలు చేయిస్తానని బెదిరించేవారు. దీంతో చేసిది లేక , ఆ నేత చెప్పిన ధరకే ఊకను అమ్మేవారు. ఇచ్చినంతా తీసుకునేవారు. ఇలా ఊకలో కూడా మేసేశారు.
విజయనగరం, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పౌరసరఫరాల శాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. తాజాగా, డీఆర్‌సీ సమావేశంలో మరోసారి ఇది చర్చకు వచ్చింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సోమవారం డీఆర్సీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పౌరసరఫరాల శాఖ ఇన్‌చార్జి అధికారిగా వ్యవహరించిన మీనాకుమారి భారీగా అవకతవకలకు పాల్పడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రి అనిత ప్రశ్నించారు. అప్పటి వైసీపీ పాలకులు ఆమెకు ఐదేళ్ల పాటు బాధ్యతలు అప్పగించడం వెనుక కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మీనాకుమారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో బదిలీపై వెళ్లిన మీనాకుమారి చేసిన అవినీతిపై రకరకాలుగా చర్చ ప్రారంభమైంది. మంత్రి అనిత అదేశాలతో అక్రమాల్లో పాలు పంచుకున్న మిగతా అధికారులు, నేతలకు భయం పట్టుకుంది.
ఐదేళ్లు అదనపు బాధ్యతలు..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పౌరసరఫరాల శాఖలో ఏఎంవోగా పని చేసినా మీనా కుమారికి ఆయా శాఖలో డీఎంగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆమె ఆ బాధ్యతలు చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎనిమిది నెలల పాటు అదే పోస్టులో కొనసాగారు. ఒకప్పుడు పూర్తి స్థాయిలో డీఎంగా ఉన్నా ఏఎంవో కీలక పాత్ర పోషించారు. ఆమె హయాంలో పౌరసరఫరాల శాఖలో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ కీలక ప్రజాప్రతినిధి అండదండలతో ఆమె అవినీతికి పాల్పడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా మిల్లర్ల నుంచి భారీగా వసూళ్లు, రేషన్ బియ్యం పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్లు కొల్లగొట్టారని, అప్పటి వైసీపీ నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మిల్లర్లతో కుమ్మక్కు..
జిల్లాలో వరి ఎక్కువగా పండిస్తారు. ఏటా ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ ధాన్యం కొనుగోలు పర్యవేక్షణ బాధ్యత పౌరసరఫరాల శాఖది. అయితే ఇన్‌చార్జి అధికారిగా ఉన్న మీనాకుమారి మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు జిల్లాలో ప్రధానంగా వినిపించేవి. అందుకే రైతులను అప్పట్లో మిల్లర్లు లెక్కచేసేవారు కాదు. 80 కిలోల ధాన్యం బస్తా వద్ద 3 నుంచి 5 కిలోల వరకూ అదనంగా రైతులు నుంచి మిల్లర్లు తీసుకునేవారు. లేకుంటే రకరకాల కారణాలు చూపుతూ ధాన్యాన్ని తిప్పి పంపేవారు. జిల్లా పౌరసరఫరాల అధికారి భరోసాతోనే మిల్లర్లు అప్పట్లో బరితెగించారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది మిల్లులు ఉండేవి. సార్టెక్స్, నాన్ సార్టెక్స్ మిషన్ల ఏర్పాటు సమయంలో సైతం మీనాకుమారి మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరించినట్టు విమర్శలు ఉన్నాయి. ఆమెకు ముడుపులిస్తూ.. అప్పటి వైసీపీ నేతలు వారికి అనుకూలంగా పనులు చేయించుకునేవారని తెలుస్తోంది. ఒక అధికారి ఐదేళ్ల పాటు ఇన్‌చార్జి పోస్టులో జిల్లా ఉన్నతాధికారిగా వ్యవహరించారంటే ఏ స్థాయిలో సహకారం అందిందో అర్థం చేసుకోవచ్చు.
రేషన్ భారీగా పక్కదారి..
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలకు చెక్ పడడం లేదు. వైసీపీ హయాంలో రేషన్ బియ్యం దందా ఓ రేంజ్‌లో కొనసాగింది. జిల్లాలో 16 మంది వరకూ దళారులు ఉన్నట్టు అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ, పౌరసరఫరాల శాఖ పరంగా వీరిపై ఎటువంటి చర్యలు లేవు. జిల్లాలో 5.81 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. 9,159 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 37,687 ఉన్నాయి. వీరికి 35 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం (1319.5 టన్నులు) అందిస్తున్నారు. అయితే రేషన్‌కార్డుదారులు తీసుకుంటున్న వారిలో 25 శాతం మంది బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కిలో రూ.13 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు వాటిని రూ.20కు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. అప్పటి అధికార వైసీపీ నేతలు బియ్యం దందాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇదంతా పౌరసరఫరాల శాఖ దన్నుతోనే చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంది. వారు ఏడాది పొడవునా మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ఇందుకుగాను క్వింటా మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం రూ.60 చెల్లిస్తుంది. అయితే ఇక్కడే కొందరు మిల్లర్లు దగా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని నేరుగా లెవీగా చూపుతున్నారు. చిరు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేయించిన రేషన్ బియ్యాన్నే మిల్లింగ్ చేసిన బియ్యంగా చూపుతున్నారు. రూ.25 నుంచి రూ.30 వరకూ రేషన్ బియ్యాన్ని చూపి లెవీకి పంపుతున్నారు. బస్తా దగ్గర రూ.30 వరకూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే మిల్లర్లు పంపిస్తున్న సీఎంఆర్‌ను గిడ్డంగుల్లో తనిఖీ చేసే టెక్నికల్ అసిస్టెంట్లు ఇష్టాసారంగా వ్యవహరించేవారు. కొందరు మిల్లర్లు ఇచ్చే సీఎంఆర్ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించక పోయినా వారి బియ్యం దించుకున్న పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ గత ఐదేళ్ల పాటు కళ్లుమూసుకుంది. దీని వెనుక వందలాది కోట్ల దందా నడిచినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.
ప్రభుత్వం వారిదే కదా..
వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైరన్ చిన్నశ్రీను మంగళవారం జడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. సివిల్ సప్లైస్ అధికారి మీనాకుమారిపై వచ్చిన అవినీతిపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 10 నెలలు అవుతుంది. ప్రభుత్వం వారిదే కదా. ఇప్పటి వరకు ఆమెపై ఎందుకు ఎంక్వాయిరీ వేయలేదు’ అని ప్రశ్నించారు.