Joint LPM Issues జాయింట్ ఎల్‌పీఎంల సమస్యకు చెక్
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:10 AM
Check on Joint LPM Issues జిల్లాలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాయింట్ ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) సమస్యకు పరిష్కార మార్గం చూపింది. ఇక నుంచి కేవలం రూ. 50 రిజిస్ర్టేషన్ రుసుముతో సింగిల్ ఎల్‌పీఎంగా మార్చుకునే అవకాశం కల్పించింది.
గత వైసీపీ సర్కారు అమలు చేసిన విధానం రద్దు
ఇకపై ఉచితంగానే సింగిల్ ఎల్‌పీఎంలుగా మార్చుకోవచ్చు
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు మొదటి అవకాశం
ఈ నెలాఖరులోగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి
జియ్యమ్మవలస, జూన్20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాయింట్ ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) సమస్యకు పరిష్కార మార్గం చూపింది. ఇక నుంచి కేవలం రూ. 50 రిజిస్ర్టేషన్ రుసుముతో సింగిల్ ఎల్‌పీఎంగా మార్చుకునే అవకాశం కల్పించింది. దీనికి ఈ నెలాఖరు వరకు సమయమిచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై జాయింట్ ఎల్‌పీఎం బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
గతంలో భూమిని సాగు చేసుకునే వ్యక్తికి సింగిల్ ఎల్‌పీఎం నెంబరు ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వ పెద్దలు జాయింట్ ఎల్‌పీఎంల విధానాన్ని అమలులోకి తెచ్చి రైతులకు భూమిపై స్వేచ్ఛ లేకుండా చేసేశారు. పార్వతీపురం, పాలకొండ డివిజన్ల పరిధిలో ఉన్న 15 మండలాల్లో 965 గ్రామాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో 2020 డిసెంబరు 21న రీసర్వే ప్రారంభించారు. మూడు విడతల్లో చేపట్టిన ప్రక్రియలో మొత్తంగా 317 గ్రామాల్లో 1.70 లక్షల ఎకరాల్లో రీసర్వే చేసి 18,642 జాయింట్ ఎల్‌పీఎంలు నమోదు చేశారు. దీనిపై విస్తుపోయిన రైతులు సింగిల్ ఎల్‌పీఎంలకై రెవెన్యూశాఖకు వినతిపత్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఇందుకోసం రూ. 500 అపరాధ రుసుముతో సింగిల్ ఎల్‌పీఎంలుగా మార్చడానికి ఆ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ పనులు చేసేందుకు సంబంధిత సిబ్బందికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందేవారు. మరోవైపు వారికి ప్రభుత్వ పథకాలు అందేవి కావు. పంటను, భూమిని అమ్ముకోవడానికైనా, తనఖా పెట్టుకోవడానికైనా జాయింట్ ఎల్‌పీఎంలో ఉన్న రైతులందరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కొన్నాళ్లుగా ఈ సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ ఎల్‌పీఎంలను సింగిల్ ఎల్‌పీఎంలుగా మార్చుకునే అవకాశం ఉచితంగా కల్పించింది. ఈ నెలాఖరులోగా సచివా లయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు మొదటి అవకాశం కల్పించనున్నారు. కాగా జిల్లాలో వ్యవసాయ సంబంధ జాయింట్ ఎల్‌పీఎంలు 18,600 వరకూ ఉన్నాయి. ఆక్వా జాయింట్ ఎల్‌పీఎంలు 42గా గుర్తించారు. వాటిల్లో 3,424 వరకు సింగిల్ ఎల్‌పీఎంలుగా మార్చారు. ఇంకా 10,206 జాయింట్ ఎల్‌పీఎంలను సింగిల్‌గా మార్చాల్సి ఉంది.
దరఖాస్తు చేసుకోవాలి..
జాయింట్ ఎల్‌పీఎంతో బాధపడుతున్న రైతులు ఈ నెలాఖరులోగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికీ అదనంగా డబ్బులు ఇవ్వనవసరం లేదు.
- పి.లక్ష్మణరావు, జేడీ, జిల్లా సర్వే శాఖ, పార్వతీపురం మన్యం