Check on Illegal Activities! అక్రమాలకు చెక్!
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:21 PM
Check on Illegal Activities! మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణాల చెల్లింపుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రుణాలు పొందిన వారు ప్రతి నెలా ఎవరికి వారే వాయిదాలు చెల్లించేలా పేమెంట్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
వైసీపీ హయాంలో ఎన్నో అవకతవకలు
కొంతమంది విలేజ్ ఆర్గనైజింగ్ ప్రతినిధులపై ఆరోపణలు
ఏళ్లు గడుస్తున్నా వారి నుంచి రికవరీ చేయని వైనం
ఇబ్బందుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు
ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విన్నపం
పార్వతీపురం, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణాల చెల్లింపుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రుణాలు పొందిన వారు ప్రతి నెలా ఎవరికి వారే వాయిదాలు చెల్లించేలా పేమెంట్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 19,880 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 2,28,716 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది రూ.55 కోట్ల వరకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రూ.50 కోట్లకు పైబడి రుణాలు అందించారు. ఈ ఏడాది 8,666 మంది మహిళా సంఘ సభ్యులకు స్ర్తీనిధి ద్వారా రూ.86.66 కోట్ల వరకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొన్నిచోట్ల అక్రమాలు
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ఏటా బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో .. రుణాలు పొందిన మహిళా సంఘాల సభ్యులు తిరిగి వాయిదాలు చెల్లించే సమయంలో అనేక అవకతవకలు జరిగాయి. కొంతమంది విలేజ్ ఆర్గనైజింగ్‌కు చెందిన ప్రతినిధులు రుణ వాయిదాలను సభ్యుల నుంచి తీసుకుని సంబంధిత ఖాతాలకు జమ చేయలేదు. దీంతో ఆ నిధులు పక్కదారి పట్టాయి. మరోవైపు మహిళా సంఘాల సభ్యుల పేరిట రుణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కొంతమంది నిరక్షరాస్యులైన సభ్యులు దీనిని తెలుసుకోలేకపోయారు. తమ రుణం తీరిపోయిందని భ్రమలో ఉన్న వారికి బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. రుణాలపై అధిక వడ్డీలు వడ్డిస్తూ రికవరీకి నోటీసులు అందిస్తుండడంతో సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. దీనిపై ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అయితే ఇకపై పరిస్థితి తలెత్తకుండా కూటమి ప్రభుత్వం పేమెంట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
నష్టపోతున్న సభ్యులు...
కొంతమంది రికవరీ ప్రతినిధుల తీరుతో మహిళా సంఘ సభ్యులు నష్టపోతున్నారు. అధిక మొత్తంలో వాయిదాలను వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఉదాహరణకు స్ర్తీనిధి ద్వారా రూ.50 వేల రుణం తీసుకుంటే వడ్డీతో కలుపుకుని రూ.2,500 చొప్పున 22 వాయిదాలు చెల్లించాల్సి ఉంది. 23వ వాయిదా రూ.1500 , 24వ వాయిదా రూ. 1600 చొప్పున తిరిగి చెల్లించుకోవచ్చు. కానీ 24 వాయిదాలను కూడా రూ.2,500 చొప్పున సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో సభ్యులు సుమారు రూ.1700 నష్టపోతున్నారు. భవిష్యత్‌లో ఇటు వంటి పరిస్థితి తలెత్తకుండా.. యాప్ ద్వారా సక్రమంగా రుణ వాయిదాలను చెల్లించే విధంగా డీఆర్‌డీఏ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.
రికవరీ ఎప్పుడు?
పాచిపెంట మండలం తుమరవల్లి , పోలమాంబ విలేజ్ ఆర్గనైజేషన్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. సభ్యులు రుణాలు తీసుకున్న ప్రాప్తికి తిరిగి వాయిదాలను చెల్లించినప్పటికీ అవి స్ర్తీనిధి ఖాతాలోకి జమకాలేదు. సభ్యులు చెల్లించిన వాయిదా సొమ్ములు స్వాహా అయ్యాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణలు చేపట్టారు. సుమారు 4.7 లక్షలను బాధ్యుల నుంచి రికవరీ చేయాలని తేల్చారు. అయితే ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు రికవరీ జరగలేదు.
పార్వతీపురం మండలం బాలగొడబ గ్రామంలో నేతాజీ విలేజ్ ఆర్గనేజేషన్ నుంచి సుమారు రూ.ఐదు లక్షలు రికవరీ చేయాల్సి ఉంది. సభ్యులు రుణ వాయిదాలు తిరిగి చెల్లించినప్పటికీ స్ర్తీనిధి ఖాతాల్లోకి అవి జమ కాలేదు. కాగా పక్కదారి పట్టిన రూ.ఐదు లక్షలు ఇంకా రికవరీ కాలేదు. ఈ విధంగా జిల్లాలో చాలాచాట్లో స్ర్తీనిధి రుణాల వసూళ్లలో అవకతవకలు జరు గుతున్నా.. సకాలంలో చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సభ్యులు పేరిట రుణాలు కొనసాగుతున్నాయి.
రికవరీకి చర్యలు
స్ర్తీనిధి ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు తిరిగి వాయిదాలను చెల్లిస్తున్నప్పటికీ కొన్ని వీవోల వద్ద జరిగిన అక్రమాలపై ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విచారణలు కూడా పూర్తయ్యాయి. పాచిపెంట మండలంలో సుమారు రూ.4 లక్షలు, పార్వతీపురం మండలంలో రూ.ఐదు లక్షలను రికవరీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం బాధ్యులు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవు. యాప్‌ల ద్వారా రుణ వాయిదాలు చెల్లించే ప్రక్రియ ప్రారంభించాం.
-కె.హేమలత, స్ర్తీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, పార్వతీపురం