Check for fluoride in those villages ఆ గ్రామాల్లో ఫ్లోరైడ్‌కు చెక్
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:39 PM
Check for fluoride in those villages రాజాం నియోజకవర్గంలోని 25 గ్రామాల ప్రజలను వణికిస్తున్న ఫ్లోరైడ్‌కు త్వరలోనే చెక్ పడనుంది. రూ.63.6 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయా గ్రామాలకు ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయనుంది. తొలుత మడ్డువలస జలాశయంలో ఇన్‌ఫిల్టరేషన్ బావులు, శుద్ధి జలాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది.
ఆ గ్రామాల్లో
ఫ్లోరైడ్‌కు చెక్
రూ.63.6 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్టు నిర్మాణం
మడ్డువలస జలాశయంలో ఇన్‌ఫిల్టర్ బావులు
ఇక్కడి నుంచి రక్షిత నీరు సరఫరా
నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
రాజాం నియోజకవర్గంలో 25 గ్రామాల్లో బాధితులు
రాజాం నియోజకవర్గంలోని 25 గ్రామాల ప్రజలను వణికిస్తున్న ఫ్లోరైడ్‌కు త్వరలోనే చెక్ పడనుంది. రూ.63.6 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయా గ్రామాలకు ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయనుంది. తొలుత మడ్డువలస జలాశయంలో ఇన్‌ఫిల్టరేషన్ బావులు, శుద్ధి జలాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. అనంతరం ఇక్కడి నుంచి బాధిత గ్రామాల్లోని పథకాల ట్యాంకులకు రక్షిత తాగునీరు సరఫరా చేయనుంది.
రాజాం, జూలై 12(ఆంధ్రజ్యోతి):
రాజాం నియోజకవర్గానికి ఫ్లోరైడ్ ప్రమాదం పొంచి ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 25 గ్రామాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఈ విషయం వైద్యఆరోగ్య శాఖ చేసిన సర్వేలో తేలింది. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లోని 25 గ్రామాల్లో 88 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 30 మంది పిల్లలు కూడా ఉన్నారు. ముగ్గురు చిన్నారులతో సహా 9 మందికి డెంటల్ ఫ్లోరోసిస్ ఉన్నట్టు గుర్తించారు. సాధారణంగా నీరు, ఆహారం ద్వారా ఫ్లోరైడ్ శరీరంలో చేరుతంది. ఇది మోతాదుకు మించి చేరితే అనారోగ్యానికి గురవుతారు. దీనినే ఫ్లోరోసిస్ అని కూడా అంటారు. ఫ్లోరైడ్ ప్రభావంతో దంతాలపై ఉండే పొర దెబ్బతింటుంది. ఫ్లోరైడ్ నీరు తాగితే కిడ్నీలు దెబ్బతింటాయి. కాగా రాజాం నియోజకవర్గంలోని ఆయా గ్రామాలపై వైద్యఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదికతో ప్రభుత్వం స్పందించింది. ఆ గ్రామాల్లో ఫోరైడ్‌ను కట్టడి చేయాలని ఆదేశించింది. రక్షిత జలాలు అందించేందుకు రూ.63 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్టును మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇవే ఆ గ్రామాలు
నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. రాజాం మండలానికి సంబంధించి అమరాం, దోసరి, మారేడుబాక, అంతకాపల్లి, పొగిరి ఉన్నాయి. సంతకవిటి మండలంలో గోవిందపురం, మండాకురిటి, బిల్లాని, జీఎస్‌పురం, గోళ్లవలస, మాధవరాయపురం...రేగిడి మండలంలో అంబకండి, కొర్లవలస, లింగాలవలస, మునకలవలస, పారంపేట, పెద్ద శిరాం, వెంకంపేట, ఒప్పంగి, వన్నలి గ్రామాలున్నాయి. వంగర మండలానికి సంబంధించి కోణంగిపాడు, కొట్టిశ, లక్షింపేట కాలనీ, మరువాడ, శ్రీహరిపురంలు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో క్రమేపీ ఫ్లోరైడ్ విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఈ గ్రామాలపై దృష్టిపెట్టింది. ఫ్లోరైడ్ నియంత్రణకు సంబంధించి మందులు ఉచితంగా పంపిణీ చేస్తోంది.
మెగా వాటర్ స్కీం..
కూటమి ప్రభుత్వం తాజాగా రాజాం నియోజకవర్గంపై దృష్టిపెట్టింది. ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు పెరుగుతున్నట్టు నివేదిక అందడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మడ్డువలస జలాశయంలో ఇన్‌ఫిల్టరేషన్ బావులు, శుద్ధి జలాల ప్లాంట్లను ఏర్పాటుచేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బాధిత గ్రామాల్లోని నీటి పథకాలకు తాగునీరు అందించనుంది. అందులో భాగంగానే ఇటీవల రూ.63.6 కోట్ల విడుదలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు, స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చొరవతో ప్రభుత్వం స్పందించింది. త్వరలో ఈ మెగా పథకానికి సంబంధించి టెండర్లు ఖరారు కానున్నాయి. అవి ఖరారైన తరువాత పనులు ప్రారంభమవుతాయి. శరవేగంగా పనులు పూర్తిచేసి శుద్ధ జలాలు అందుబాటులోకి తెచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ప్రత్యేకంగా దృష్టిపెట్టాం
రాజాం నియోజకవర్గంలో 25 గ్రామాలను ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుగా గుర్తించాం. అక్కడ ఫ్లోరైడ్‌ను నియంత్రించేందుకు మందుల పంపిణీ జరుగుతోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సైతం నివేదించాం. సాధారణంగా నీరు, ఆహారంతోనే మనిషిలో ఫ్లోరైడ్ ప్రవేశిస్తుంది. అందుకే పౌష్టికాహారంతో పాటు శుద్ధ జలాలు తీసుకోవాలని బాధిత గ్రామల ప్రజలకు అవగాహన కల్పించాం.
- జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ప్రభుత్వం రాజాం నియోజకవర్గంపై దృష్టిపెట్టింది. ఫ్లోరైడ్ బాధిత గ్రామాల ప్రజలకు శుద్ధ జలాలు అందించేందుకు నిర్ణయిస్తూ రూ.63.6 కోట్లు మంజూరు చేసింది. వీలైనంత త్వరగా పనులు పట్టాలెక్కించేందుకు ప్రభుత్వపరంగా ప్రయత్నిస్తున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చూస్తాం.
- కోండ్రు మురళీమోహన్, ఎమ్మెల్యే, రాజాం
-------------