Check before land occupation భూ ఆక్రమణకు ఆదిలోనే చెక్
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:19 AM
Check before land occupation కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలకు దిగారు. క్షేత్రస్థాయికి తహసీల్దార్ చేరుకుని పనులను ఆపించారు. మరోసారి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భూ ఆక్రమణకు ఆదిలోనే చెక్
చదును పనులను ఆపించిన తహసీల్దారు
కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నం
పూసపాటిరేగ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి):
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలకు దిగారు. క్షేత్రస్థాయికి తహసీల్దార్ చేరుకుని పనులను ఆపించారు. మరోసారి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చోడమ్మఅగ్రహారం రెవెన్యూ పరిధిలో జాతీయరహదారికి ఆనుకొని ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబరు 62-4లో ఉన్న 1.66 ఎకరాల విలువ సుమారు రూ.10కోట్ల పైమాటే. దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇప్పటికే చిన్నచిన్నగా ఆక్రమించడం మొదలుపెట్టారు. తాజాగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టేందుకు పనులు మొదలు పెట్టారు. దీనిపై స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో వీఆర్‌వో గౌషీని పరిశీలనకు తహసీల్దార్ పంపారు. ఆమె ప్రభుత్వ భూమిగా గుర్తించి పనులు నిలుపుదల చేయాలని చెప్పారు. అయినా ఆక్రమణదారులు పనులను ఆపలేదు. పైగా బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు సమాచారం. దీంతో తహసీల్దారు ఎన్‌వీ రమణ మంగళవారం నేరుగా పనులను పరిశీలించి ఆక్రమణలకు గురవుతోందని గుర్తించారు. వెంటనే ఆపాలని ఆదేశించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వభూమికి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.