Changes in ‘Upadhi’ Scheme ‘ఉపాధి’లో మార్పులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:48 PM
Changes in ‘Upadhi’ Scheme ఉపాధి హామీ పథకం పేరు మారింది. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఈమేరకు జిల్లాలో వేతనదారుల పని దినాల సంఖ్య పెరగనుంది. దీనిపై త్వరలోనే ఆదేశాలు రానున్నాయి.
పనిదినాలు కూడా పెంపు
ఇంకా ఆదేశాలు రాలేదంటున్న అధికారులు
పార్వతీపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పేరు మారింది. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఈమేరకు జిల్లాలో వేతనదారుల పని దినాల సంఖ్య పెరగనుంది. దీనిపై త్వరలోనే ఆదేశాలు రానున్నాయి. మన్యంలో సుమారు 2.01 లక్షల జాబ్‌కార్డులున్నాయి. అందులో 1.93 లక్షల జాబ్‌కార్డులకు చెందిన 3.40 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మిగిలిన వేతనదారులు వారికి అవసరమైనప్పుడు మాత్రమే పనులకు వెళ్తున్నారు. రెగ్యులర్‌గా పనులకు హాజరవుతున్న వారిలో ఎస్సీలు 1,11,071 మంది , ఎస్టీలు సుమారు 38 వేల మంది వరకు ఉన్నారు. ఇంతవరకు వారందరూ వంద రోజులు గరిష్టంగా పనులు చేపట్టారు. ఇకపై ప్రతి జాబ్‌కార్డు హోల్డర్ 125 రోజుల పాటు పనిదినాలు పొందుతారు.
నిధుల కేటాయింపులో పరిమితి..
ఉపాధి హామీ పథకంలో వేతనదారుల పనిదినాల పెంపుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమ వుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించే నిధుల్లో పరిమితులు విధించినట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం ఇప్పటి వరకు 90 శాతం వరకు నిధులు మంజూరు చేసేది. అయితే ఇకపై 60 శాతం మాత్రమే కేటాయిం చనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది. అంతేకాకుండా బడ్జెట్‌లోనూ రాష్ర్టాలకు కేటాయించే నిధులను తగ్గించనుందనే ప్రచారం జరుగుతుంది. మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్లో పరిమితులు విధిస్తే.. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న రహదారులు, కాలువలు తదితర అభివృద్ధి పనులపై ప్రభావం పడనుంది. గ్రామసభల ద్వారా గుర్తించే పనులన్నీ చేపట్టే అవకాశం ఉండదు. దీనిపై డ్వామా పీడీ రామచంద్రరావును వివరణ కోరగా.. ‘కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చినట్లు వార్తల ద్వారా తెలుసుకున్నాం. అయితే దీనిపై ఎటుంటి ఆదేశాలు రాలేదు. పనిదినాల పెంపుపై కూడా ఉత్తర్వులు ఇంకా రాలేదు.’ అని తెలిపారు.