‘ఆదికర్మయోగి’తో గిరిజన ప్రాంతాల్లో మార్పు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:27 AM
ఆదికర్మయోగి కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మార్పు తేవడానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
- కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆదికర్మయోగి కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మార్పు తేవడానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఆదికర్మయోగి బ్లాక్ స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఆదికర్మయోగి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ‘మొదటి దశలో ఆరు మండలాలకు సంబంధించి శిక్షకులు వై.శంకరరావు, పీఎంకెరెడ్డి, డాక్టర్ రమణకుమార్, సోమేశ్వరరావు, చంద్రబాబు, చంద్రమౌళి, రాజశ్రీలకు శిక్షణ అందించాం. సామాజిక భాగస్వామ్యం, అవగాహనతో గ్రామాల్లో అవసరాలను గుర్తిస్తాం. గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తాం. ఇందుకు ఆన్‌లైన్ టూల్‌ను తయారు చేస్తాం. పలువురు స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యంతో గ్రామాల్లో పనులు చేపడతాం.’ అని కలెక్టర్ అన్నారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఆది కర్మయోగి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మనది అనే సొంత భావన ప్రజల్లో ఏర్పడుతుందని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన కర్మయోగిలకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ పీఎం జన్మన్ ప్రాజెక్టు అధికారి రిషబ్ చతుర్వేది, ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎ.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.