Share News

Challenge to Nagarjuna! నాగార్జునకు సవాలే!

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:32 AM

Challenge to Nagarjuna! విధేయత, సమర్థత కొలమాణాలుగా టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మళ్లీ నాగార్జునకే దక్కాయి. అయితే స్థానిక ఎన్నికల తరుణం సమీపిస్తున్న సమయంలో అందరినీ కలుపుకుని వెళ్లడం నాగార్జునకు గట్టి సవాల్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Challenge to Nagarjuna! నాగార్జునకు సవాలే!

నాగార్జునకు సవాలే!

జిల్లా టీటీపీ పగ్గాలు కత్తిమీద సామే

శ్రేణులతో సమన్వయమే కీలకం

మిత్ర పక్షాలను కలుపుకెళ్లాల్సిన తరుణం

యువతకు అధిష్టానం ప్రోత్సాహం

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం

విజయనగరం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి):

విధేయత, సమర్థత కొలమాణాలుగా టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మళ్లీ నాగార్జునకే దక్కాయి. అయితే స్థానిక ఎన్నికల తరుణం సమీపిస్తున్న సమయంలో అందరినీ కలుపుకుని వెళ్లడం నాగార్జునకు గట్టి సవాల్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందులోనూ కూటమి పక్షాలతో కలిసి వెళ్లాల్సిన క్రమంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. కాగా శ్రేణులతో ఆయనకున్న అనుబంధం, కీలక సమయాల్లో చొరవ, ప్రత్యర్థులపై సంధించే వాగ్భాణాలు, అందరినీ కలుపుకుంటూ వెళ్లే ధోరణి తదితర అంశాలను చూసి అధిష్ఠానం మరో అవకాశం ఇచ్చిందని పార్టీలో చెప్పుకుంటున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించగలడన్న నమ్మకం కూడా పదవి రావడానికి మరో కారణంగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ జిల్లాలో అశోక్‌గజపతిరాజు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన గోవా గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ పదవి చేపట్టడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తే ఎలా వ్యవహరిస్తాడన్నదే ముఖ్యం. అందుకే యువకులుగా ఉన్న నాగార్జునతో పాటు ప్రధాన కార్యదర్శిగా వరప్రసాద్‌ను నియమించారు. వారిద్దరూ సమన్వయంతో స్వయంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆపై జనసేనతో పాటు బీజేపీ మిత్రపక్షాలుగా ఉండడంతో వారిని సైతం కలుపుకెళ్లాల్సి ఉంది. ఒకటి రెండుచోట్ల కొంత ఇబ్బందులు ఉన్నా.. ఎప్పటికప్పుడు విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టించి, వారిని మోప్పించి మరీ.. ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

ఆ రెండు చోట్ల..

పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రెండుచోట్ల బీజేపీ, జనసేనలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఐదుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యేగా లోకం మాధవి ఉన్నారు. అక్కడ టీడీపీ నేత బంగార్రాజుతో ఆమెకు కాస్త విభేదాలు ఉన్నాయి. మరోవైపు ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనూ కేడర్‌లో చిన్నపాటి స్పర్థలు ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన అవసరం నాయకత్వంపై ఉంది. మరోవైపు ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు ఉన్నారు. అక్కడ ఇప్పటివరకూ టీడీపీ ఇన్‌చార్జిని నియమించలేదు. అక్కడ టీడీపీకి పెద్దదిక్కుగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. కానీ నాలుగు మండలాల్లో టీడీపీకి బలమైన కేడర్‌ ఉంది. వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం నాయకత్వంపై ఉంది.

చిన్న చిన్న విభేదాలే..

రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఎమ్మెల్యేగా కోండ్రు మురళీమోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ సీనియర్‌ నాయకురాలు కావలి ప్రతిభాభారతి ఉన్నారు. ఆమె కుమార్తె గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఇక్కడ కళా కుటుంబ ప్రభావం అధికంగా ఉంది. అందుకే చిన్నపాటి విభేదాలు ఉన్నాయి. అటు ఎస్‌.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్సెస్‌ గొంప కృష్ణ అన్నట్టు ఉంది. అక్కడ కూడా పార్టీ శ్రేణులను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు గజపతినగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు సమీప బంధువు. వారి మధ్య సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు జనసేనలో మాజీ మంత్రి పడాల అరుణ ఉన్నారు. ఈ పరిస్థితుల నడుమ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలంగా నిలబెట్టాల్సిన అవసరం కిమిడి నాగార్జునపై ఉంది.

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

కిమిడి నాగార్జున, పార్టీ జిల్లా అధ్యక్షుడు

రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తాం. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అందరినీ సమన్వయపరిచి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం. కూటమి నాయకులతో ఎప్పటికప్పుడు చర్చించి సమన్వయ లోపం లేకుండా చూస్తాం. పార్టీ కోసం శ్రమించే నాయకులు, కార్యకర్తలకు అధిష్ఠానం అండగా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు తరహాలోనే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తాం.

సీనియర్లతో కలుపుకుని వెళ్తాం

ప్రసాదుల వర ప్రసాద్‌, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి

తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వారందరినీ కలుపుకుని వారి సూచనలు, సలహాలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అధిష్టానం తనకి ఇచ్చిన ఈ పదవికి వన్నె తెచ్చేలా మరింత బాధ్యతగా పనిచేస్తాం. ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. వాటన్నింటినీ వార్డు స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలతో విస్తృత ప్రచారం చేస్తాం. ప్రతిపక్షాల తప్పుడు దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నాం. పార్టీలో కష్టపడేవారికి ఎప్పుడూ తగిన ప్రాధాన్యం ఉంటుంది.

----------------------

Updated Date - Dec 26 , 2025 | 12:32 AM