Celebrations అంబరాన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:08 AM
Celebrations Touch the Sky దసరా ఉత్సవాల సందర్భంగా బుధవారం పాలకొండలో కోటదుర్గమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు వీధులకు చెందిన భక్తులు ముర్రాటలు, ఘటాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
భక్తజనంతో కిటకిటలాడిన పాలకొండ
పాలకొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల సందర్భంగా బుధవారం పాలకొండలో కోటదుర్గమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు వీధులకు చెందిన భక్తులు ముర్రాటలు, ఘటాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సామూహిక సంబరాలు నిర్వహించారు. అమ్మవారి వేషధార ణాలు, కోలాటాలు, డప్పువాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బంధువులు, స్నేహితులు దూర ప్రాంతాల నుంచి రావడంతో పాలకొండ కిక్కిరిసింది. పట్టణంలో కోటదుర్గమ్మ నామస్మరణ మార్మోగింది.
కాశీ అన్నపూర్ణేశ్వరిదేవిగా కోటదుర్గమ్మ
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ బుధవారం కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, ఒడిశా రాష్ట్రం నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. గంటల కొద్దీ నిరీక్షించిన తర్వాత వారు కోట దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొందరు మహిళలు కుంకుమ పూజలు చేపట్టారు. ఈవో వీవీ సూర్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.