Cash Deposited గంటల్లోనే నగదు జమ
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:55 PM
Cash Deposited Within Hours జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నా రైతులకు గంటల వ్యవధిలోనే నగదు అందుతోంది. విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకు ఖాతాల్లోకి రూ.17.22 కోట్లు
మన్యం రైతుల్లో ఆనందం
పార్వతీపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నా రైతులకు గంటల వ్యవధిలోనే నగదు అందుతోంది. విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 180 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టారు. ఇప్పటివరకు 1177 మంది రైతులు 12,973 టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. ఈ మేరకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 17.22 కోట్లు జమైంది. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయించిన రైతులు నానా అవస్థలు పడేవారు. నగదు ఎప్పుడు జమవుతుందా? అని ఎదురుచూసేవారు. కొంతమంది రైతులు అప్పులు చేసుకుని మరీ సంక్రాంతి పండగ జరపుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ మారింది. ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. గత ఖరీఫ్ కాలంలోనూ ఇలానే చెల్లింపులు చేసింది. మొత్తంగా సర్కారు చర్యలతో మన్యం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేగవంతం చేస్తే మరింత మేలు..
జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. దీనిపై సంబంధిత అధికారులు కూడా దృష్టిసారించడం లేదు. మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో కొంతమంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వర్తకులు, దళారులకు విక్రయించి నష్టపోతున్నారు. మొత్తంగా మన్యం నుంచి ఇతర జిల్లాలకు ధాన్యం తరలిపోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సి ఉంది.
ఎంతో ఆనందంగా ఉంది
నేను 160 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించా. 24 గంటల్లోనే నా బ్యాంకు ఖాతాలో నగదు జమైంది. ఎంతో ఆనందంగా ఉంది.
- ఆర్.సింహాచలం, బాగువలస, సాలూరు మండలం...
=========================
24 గంటల్లోనే..
నేను 141 ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రంలో విక్రయించా. దీనికి సంబంధించి 24 గంటల్లో నా బ్యాంకు ఖాతాలో నగదు జమైంది.
- చింతల సత్యనారాయణ, అప్పయ్యపేట, సీతానగరం మండలం
=========================
12 గంటల్లోపే జమ
నేను 69 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించా. దీనికి సంబంధించి రూ. 1,91,197 నా బ్యాంకు ఖాతాలోకి 12 గంటల్లోపే జమైంది. ఎంతో ఆనందంగా ఉంది.
- బి.రాంబాబు, చిలకపల్లి, బలిజిపేట మండలం
=========================
48 గంటల్లోపే ..
ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి నగదు జమవుతుంది. కొంతమంది రైతులకు 12 గంటల్లోపే నగదు అందుతుంది. ఇప్పటివరకు రూ.17.22 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమైంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం.
- యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్, పార్వతీపురం మన్యం