Can't you provide drinking water? తాగునీరు ఇవ్వలేరా?
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:14 AM
Can't you provide drinking water? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది రాజాం మునిసిపాల్టీ దుస్థితి. పేరుమోసిన పట్టణంలో పురవాసులు ఎప్పటికప్పుడు తాగునీటి కష్టాలు పడుతున్నారు. ఈ విషయంలో యంత్రాంగం విఫలమవుతోంది. దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్లు, రక్షిత నీటి పథకాలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
తాగునీరు ఇవ్వలేరా?
ప్రశ్నిస్తున్న రాజాం వాసులు
అస్తవ్యస్తంగా నీటి సరఫరా
సగం రోజులు పంపిణీ చేస్తే గ్రేటే
తరచూ పాడవుతున్న ప్రధాన పైపులైన్లు
ఎక్కడికక్కడే తెగిపోతున్న 200 ఎంఎం పైపు
మూడు రోజులుగా అందని తాగునీరు
రాజాం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి):
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది రాజాం మునిసిపాల్టీ దుస్థితి. పేరుమోసిన పట్టణంలో పురవాసులు ఎప్పటికప్పుడు తాగునీటి కష్టాలు పడుతున్నారు. ఈ విషయంలో యంత్రాంగం విఫలమవుతోంది. దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్లు, రక్షిత నీటి పథకాలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తరచూ పైపులైన్లు పగిలిపోతున్నాయి. సోమవారం పాలకొండ రోడ్డులో డిస్ర్టిబ్యూటరీ పైపులైన్ విరిగిపోయింది. రోడ్డు అడుగుభాగంలో పైపులైన్ ఉండడంతో లీకును గుర్తించేందుకు అధికారులు ఆపసోపాలు పడ్డారు. చివరకు యంత్రాలతో మట్టిని తవ్వి గుర్తించారు. వెల్డింగ్‌తో సరిచేశారు. ప్రధాన పైపులైన్‌కు సంబంధించి 200 ఎంఎం డయా పైపు ఎప్పటికప్పుడే పాడవుతోంది. దీంతో నీటి సరఫరా తరచూ నిలిచిపోతోంది. నెలలో సగం రోజులు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు కూడా మూడు రోజులుగా నీరందడం లేదు.
రాజాం మునిసిపాల్టీలో 20 వార్డులు ఉన్నాయి. దాదాపు 12 వేల గృహాలు ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 47,120 మంది జనాభా ఉన్నారు. 2021లో జనాభా లెక్కలు చేపట్టకపోవడంతో స్పష్టంగా తెలియనప్పటికీ ఈ సంఖ్య 60 వేలకు చేరుకునే అవకాశం ఉంది. పట్టణంలో శివారు కాలనీలు సైతం పెరిగాయి. అటు సారధి, కొత్తవలస, పొనుగూటివలస, కొండంపేట గ్రామాలు సైతం రాజాం మునిసిపాల్టీలో విలీనమయ్యాయి. కానీ తాగునీరు మాత్రం అరకొరగానే సరఫరా అవుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న మునిసిపల్ యంత్రాంగం తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. మునిసిపాల్టీలో ఏడు రక్షిత నీటి పథకాల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. ఎప్పుడో మేజర్ పంచాయతీ సమయంలో ఏర్పాటుచేసిన రక్షిత నీటి పథకాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.
తరచూ సమస్యలే
మునిసిపాల్టీకి సంబంధించి మంచినీటి పథకాలకు తాగునీటి సరఫరా చేసే ఇన్‌ఫిల్టరేషన్ బావులను రేగిడి మండలం సంకిలి వద్ద నాగావళిలో ఏర్పాటుచేశారు. అక్కడ నీటిని శుద్ధిచేసి పైపులైన్ల ద్వారా రాజాం మునిసిపాల్టీలోని రక్షిత నీటి పథకాలకు తరలిస్తున్నారు. అయితే దశాబ్దాల కిందట నాటి పైపులైన్లు కావడంతో పూర్తిగా పాడయ్యాయి. తరచూ మొరా యిస్తున్నాయి. పైపులు లీకులమయం కావడంతో తాగునీరు వృథా కావడంతో పాటు వ్యర్థాలు, మట్టి కలిసిపోతున్నాయి. తరచూ కుళాయిల ద్వారా బురద నీరు వస్తోంది. అటు సంకిలి వద్ద ఉన్న పంపుహౌస్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. జనరేటర్ ఏర్పాటుచేస్తుంటే గంటకు ఆరువేల రూపాయల వరకూ డీజిల్ ఖర్చవుతోంది. దీంతో కత్తిమీద సాముగా మారడంతో అధికారులు విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు ట్యాంకర్లను నింపుతున్నారు. రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ ప్రజలు పెరిగారు. వారి నీటి అవసరాలు పెరిగాయి. మనిషికి దాదాపు రోజుకు 20 లీటర్లు అవసరం. ఈ లెక్కన దాదాపు 60 వేల మంది జనాభా ఉన్న రాజాం మునిసిపాల్టీకి రోజుకు లక్షా 20 వేల లీటర్ల నీరు అవసరం. అందులో సగం కూడా సరఫరా చేయలేని స్థితిలో యంత్రాంగం ఉంది. ఇప్పటికైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
తాగునీటి ఎద్దడి
పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. శివారు కాలనీలకు తాగునీరు అందడం లేదు. అధికారులు మాత్రం నీటి పన్నులు కట్టించుకుంటున్నారు కానీ నీరు సరఫరాచేయడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తుండడంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టాలి.
- కంచుపల్లి సీతంనాయుడు, వస్త్రపురి కాలనీ, రాజాం మునిసిపాల్టీ
ఇబ్బందిగా ఉంది
పేరుకే పట్టణం. కానీ గ్రామానికంటే తీసికట్టుగా మారింది. పూర్వం నాటి పైపులైన్లు కావడంతో లీకులకు గురవుతున్నాయి. చెత్త, వ్యర్థాలు చేరి నీరు బురదమయంగా మారుతోంది. బయట 20 లీటర్ల నీటిని రూ.30 లకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాజాం మునిసిపాల్టీపై ప్రభుత్వం శీతకన్ను వేయడం దారుణం.
- గార గున్నంనాయుడు, పొనుగుటివలస, రాజాం మునిసిపాల్టీ
ప్రత్యేక ప్రణాళిక
మునిసిపాల్టీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. సంకిలి పంపుసెట్ వద్ద తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. మోటార్లు సైతం మొరాయిస్తున్నాయి. పైపులైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి. దాంతో నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడగలుగుతున్నాం.
- వెంకటరామరాజు, ఏఈ, రాజాం