Share News

Can’t This Be Stopped? అడ్డుకట్ట వేయలేరా?

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:44 AM

Can’t This Be Stopped? తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని షట్టరు మరమ్మతులకు గురైంది. దీంతో గత 15 రోజులకు పైగా ప్రధాన కాలువ నుంచి సాగునీరు వృథాగా పోతోంది. దిగువ ప్రాంతాలకు నీరు చేరుతుండడంతో గరుగుబిల్లి, వీరఘట్టం మండ లాల్లో మొదటి బ్రాంచి పరిధిలోని శివారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Can’t This Be Stopped?  అడ్డుకట్ట వేయలేరా?
ప్రధాన కాలువ నుంచి దిగువకు వృథాగా పోతున్న సాగునీరు

  • మరమ్మతులకు నోచుకోని షట్టరు

  • టెండర్లు పిలిచినా.. ముందుకు రాని కాంట్రాక్టర్లు

  • రైతుల మండిపాటు

గరుగుబిల్లి, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని షట్టరు మరమ్మతులకు గురైంది. దీంతో గత 15 రోజులకు పైగా ప్రధాన కాలువ నుంచి సాగునీరు వృథాగా పోతోంది. దిగువ ప్రాంతాలకు నీరు చేరుతుండడంతో గరుగుబిల్లి, వీరఘట్టం మండ లాల్లో మొదటి బ్రాంచి పరిధిలోని శివారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి కోతలు పూర్తయిన సమయంలో సాగునీరు సరఫరా అవుతుండడంతో ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని రైతులు పంటలు తెచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు వీరఘట్టం మీదుగా పాలకొండలోని పలు వీధులు, రహదారులపై తోటపల్లి సాగునీరు చేరుతుంది. దీంతో ప్రజలు, వాహనదారుల రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. దీనిపై అధికారులు, సాగునీటి సంఘాలు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో 2008లో ఎడమ ప్రధాన కాలువకు సాగునీరు సరఫరా చేసేందుకు షట్టరు ఏర్పాటు చేశారు. అయితే సుమారు 17 ఏళ్లుగా ఎటువంటి మరమ్మతులు చేపట్టక పోవ డంతో ఏటా సాగునీరు విడుదల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం షట్టర్‌ మరమ్మతులకు గురవడంతో ఎడమ కాలువ నుంచి వృథాగా సాగునీరు సరఫరా అవుతోంది. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల నిర్వహించకుంటే ప్రాజెక్టు ప్రాంతంలో నిరసనకు దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంబంధిత జల వనరులశాఖ అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు నిర్వహించి రబీకి సాగునీరు సరఫరా అయ్యేలా దృష్టి సారించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

ప్రమాదం నుంచి బయటపడ్డ లస్కర్లు

రెండు రోజుల కిందట ఎడమ ప్రధాన కాలువ సాగునీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి నాగావళి లోకి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఈ పనులు చేపడుతున్న సమయంలో ముగ్గురు లస్కర్లు ఎడమ ప్రధాన కాలువలో పడబోయారు. ఐరన్‌ గజాలు సహాయంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. యంత్రం సహాయంతో పనులు నిర్వహించినా నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయలేక సిబ్బంది వెనుదిరిగారు.

టెండర్లు పిలిచినా..

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ, కుడి ప్రధాన కాలువల పరిధిలోని షట్టర్ల మరమ్మతులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాగా రెండు షట్టర్లకు సంబంధించి సుమారు రూ. 20లక్షలతో పనుల నిర్వహణకు పాలకొండ, వీరఘట్టం జల వనరులశాఖ అధికారులు ప్రతిపాదించారు. గత మూడేళ్లుగా రెండుసార్లు టెండర్లు నిర్వహించినా ఎవరూ ముం దుకు రాలేదు. మరోవైపు ప్రధాన కాలువల అభివృద్ధికి గత కొన్నాళ్లుగా నిధుల సమస్య నెల కొంది. దీంతో సాగునీరు విడుదల సమయంలో గండ్లు పడిన చోట ఆయా ప్రాంతాల పరిధిలోని రైతులే సొంతంగా పూడ్చుకునే పరిస్థితి నెలకొంది.

పనుల నిర్వహణకు సన్నాహాలు

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువకు చెందిన షట్టర్ల మరమ్మతులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గత మూడేళ్లుగా పలు ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రయోజనం ఉండడం లేదు. నిర్వహణ పనులకు ఎవరూ ఆసక్తి చూడం లేదు.ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం టెండర్లతో కాకుండా నామినేషన్‌పై పనుల నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ పనులు చేపట్టేవరకూ సాగునీరును అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది.

డీవీ రమణ, ఏఈ, జల వనరులశాఖ, వీరఘట్టం

Updated Date - Dec 06 , 2025 | 12:44 AM