భూమున్నా.. అమ్ముకోలేక!
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:22 AM
Can't sell the land! వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళా రైతుకు చెందిన 1.06 ఎకరాల అసైన్డ్ భూమికి గత వైసీపీ ప్రభుత్వం శాశ్వత భూ హక్కును(ఫ్రీహోల్డ్) కల్పించింది. దీంతో ఆమె మంచి ధర కోసం ఎదురుచూసింది.

భూమున్నా.. అమ్ముకోలేక!
నిరాశలో భూ యాజమాన్య హక్కులు పొందిన రైతులు
ఫ్రీహోల్డ్ భూముల్లో రిజిస్ట్రేషన్లకు నోచాన్స్
మరో రెండు నెలలు గడువు పొడిగింపు
విచారణ పూర్తికాకపోవడంతోనే ఈ నిర్ణయం
జిల్లాలో 7490.62 ఎకరాలకు శాశ్వత భూ హక్కు
వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళా రైతుకు చెందిన 1.06 ఎకరాల అసైన్డ్ భూమికి గత వైసీపీ ప్రభుత్వం శాశ్వత భూ హక్కును(ఫ్రీహోల్డ్) కల్పించింది. దీంతో ఆమె మంచి ధర కోసం ఎదురుచూసింది. ఇంతలో ప్రభుత్వం మారింది. అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కులను కల్పించే పేరుతో వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడిందంటూ కూటమి ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములపై విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భూమి అమ్మడానికి అవకాశం లేక, అవసరాలకు చేతిలో డబ్బులు లేక ఆమె ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఇలా జిల్లాలో అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు పొందిన ఎంతో మంది రైతులు వీటిని విక్రయించుకొనే అవకాశం లేక నేటికీ అవస్థలు పడుతున్నారు.
శృంగవరపుకోట, మార్చి 13(ఆంధ్రజ్యోతి):
ఫ్రీహోల్డ్ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరగకుండా విధించిన గడువును కూటమి ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. రెవెన్యూ అధికారుల విచారణ పూర్తి కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 7490.62 ఎకరాల అసైన్డ్ భూములపై గత ప్రభుత్వం శాశ్వత భూ హక్కులను (ఫ్రీహోల్డ్) కల్పించింది. కాగా రామభద్రపురంలో 33.88 ఎకరాలు, దత్తిరాజేరు 0.36 ఎకరాలు, గజపతినగరం 6.11 ఎకరాలు, మెరకముడదాం ఒక ఎకరా, భోగాపురం 19.6, డెంకాడ 5.1 ఎకరాలు, విజయనగరం 11.56 ఎకరాలు, గంట్యాడ 1.25 ఎకరాలు, వేపాడ 100.55 ఎకరాలు కలిపి మొత్తం 179.41 ఎకరాల్లో చాలా వేగంగా రిజిస్ట్రేషన్‌లు చేసేసారు. ఈ భూముల రిజిస్ర్టేషన్లు జరిగిన మరుక్షణమే రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లోనూ నమోదు చేసేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ తంతు అప్పట్లోనే పలు అనుమానాలకు తావిచ్చింది. అప్పటి ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకుల సహకారంతో రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కులు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఆ భూముల లెక్కతేల్చేందుకు సిద్ధపడింది.
అక్రమాలను నిర్ధారించిన సిసోడియా
గత ఏడాది ఆగస్టులో భూపరిపాలన, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా జిల్లాల వారీగా ఫ్రీహోల్డ్ భూముల వివరాలను పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లాకు ఆగస్టు 16న వచ్చారు. జిల్లాలో అత్యధికంగా ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్ జరిగిన శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులను పరిశీలించారు. అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అప్పటి సబ్‌రిజిస్ట్రార్‌పై చర్యలూ తీసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను మాత్రం ఇంతవరకు గుర్తించలేకపోయారు. ఫ్రీహోల్డ్‌లో జరిగిన అవకతవకలను తేల్చలేకపో యారు.
వారంతా కదలకే..
జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల్లో ఫ్రీహోల్డ్ జరిగిందో బయటపెట్టడం లేదు. ఇప్పటికీ అనేక దఫాలు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తహసీల్దార్‌లు, ఉప తహసీల్దార్‌లతో సమావేశమయ్యారు. లెక్కలు తేల్చి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ లెక్క కొలిక్కిరానట్లు తెలుస్తోంది. దీనికి కారణం జిల్లాలో అప్పట్లో పని చేసిన తహసీల్దార్‌లు, ఉప తహసీల్దార్‌లు, అదే సిబ్బంది నేటికీ ఉన్నారు. తహసీల్దార్‌లను ఒక మండలం నుంచి మరో మండలానికి మార్చినప్పటికీ ఉప తహసీల్దార్‌లలో సగానికి పైబడి అప్పడు పని చేసిన మండలాల్లోనే ఇప్పటికీ పని చేస్తున్నారు. ఆర్‌ఐ, వీఆర్‌వోలూ అంతే. అప్పట్లో వీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చూస్తున్నారు. దీంతో ఎన్నిసార్లు ప్రభుత్వం, కలెక్టర్‌లు ఫ్రీహోల్డ్ భూముల వివరాలను సక్రమంగా ఇవ్వాలని అడిగినా పట్టించుకోవడం లేదు. పంపించిన నివేదికలనే అటు ఇటు మార్చి పంపిస్తుండడంతో లెక్క తేలడం లేదు. ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వమైతే ఫ్రీహోల్డ్ భూముల అవకతకవకలను నిగ్గుతేల్చాలన్న పట్టుదలతో ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించింది. దీన్ని తేల్చేవరకు రిజిస్ట్రేషన్‌లకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి వల్ల అసైన్డ్ భూముల్లో న్యాయపరంగా శాశ్వత భూ హక్కులను పొందిన చిన్న, సన్నకార రైతులు క్రయ, విక్రయాలు చేసుకోలేకపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రస్తుతానికి వీరికి నష్టం జరుగుతోంది.