Share News

Can't just provide 'shelter'? ఆ మాత్రం ‘షెల్టర్‌’ ఇవ్వలేరా?

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:38 PM

Can't just provide 'shelter'? జిల్లాలో నైట్‌ షెల్టర్ల ఏర్పాటు కలగా మిగులుతోంది. గత ప్రభుత్వ నిర్వాకం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత, అధికార యంత్రాంగం అలసత్వం అభాగ్యులకు అశనిపాతమైంది. ప్రతి లక్షమందికీ ఒక హోమ్లీసెంటర్‌ ఉండాలన్న సుప్రీంకోర్టు సూచన ఆచరణకు నోచుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 98 షెల్టర్లు నిర్వహిస్తుండగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కటేసి చొప్పున ఉండడం, అదికూడా దాతల సౌజన్యంతో అరకొరగా నడుస్తుండడం దయనీయం.

Can't  just provide 'shelter'? ఆ మాత్రం ‘షెల్టర్‌’ ఇవ్వలేరా?

ఆ మాత్రం ‘షెల్టర్‌’ ఇవ్వలేరా?

నైట్‌ షెల్టర్లను గాలికొదిలేసిన గత ప్రభుత్వం

ఒక్కరూపాయి విదల్చని అమానవీయం

జిల్లా కేంద్రంలో ఒక్కటే నడుస్తున్న వైనం

అదీ దాతల సహకారంతోనే..

నిధుల సమస్య వల్లే: మెప్మా పీడీ

జిల్లాలో నైట్‌ షెల్టర్ల ఏర్పాటు కలగా మిగులుతోంది. గత ప్రభుత్వ నిర్వాకం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత, అధికార యంత్రాంగం అలసత్వం అభాగ్యులకు అశనిపాతమైంది. ప్రతి లక్షమందికీ ఒక హోమ్లీసెంటర్‌ ఉండాలన్న సుప్రీంకోర్టు సూచన ఆచరణకు నోచుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 98 షెల్టర్లు నిర్వహిస్తుండగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కటేసి చొప్పున ఉండడం, అదికూడా దాతల సౌజన్యంతో అరకొరగా నడుస్తుండడం దయనీయం.

మెంటాడ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి):

కటిక పేదరికం వల్ల కొందరు, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై మరికొందరు, ఉపాధి వేటలో ఇంకొందరు ఇలా వివిధ కారణాలతో నగరాల బాటపట్టే ఎంతోమంది ఫుట్‌ పాత్‌లు, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పార్కులను తాత్కాలిక అవాసంగా చేసుకుంటున్నారు. అటువంటి వారికోసం 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం నైట్‌ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి లక్షమంది జనాభాకు ఒక హోమ్లీ సెల్టర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు లోగడ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆచరణకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలో ఒక్కటే నడుస్తోంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 98 నైట్‌ షెల్టర్లు ఉన్నాయి. జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ (ఎల్‌యూఎల్‌ఎం), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి. ఒక్కో నైట్‌ సెల్టర్‌లో 50 మంది వరకు ఆశ్రయం కల్పించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని 98 షెల్టర్లలో 2545 మంది ఆశ్రమం పొందుతున్నారు.

షెల్టర్లలో సౌకర్యలు ఇవీ..

నైట్‌ షెల్టర్లలో రాత్రుళ్లు నిద్రపోయేందుకు ఫ్యాన్లు, బెడ్లు ఉంటాయి. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ఉంటుంది. దాతలు ముందుకొచ్చినచోట అల్పాహారం, భోజనం సమకూర్చుతారు. ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంటాయి. పురుషులు,మహిళలకు వేర్వేరు షెల్టర్లు నిర్వహిస్తారు.

అనాథల గుర్తింపు ఇలా...

నగరాలు, పట్టణాల్లో ప్రతిరోజూ రాత్రి ప్రత్యేక బృందాల తిరుగుతూ బహిరంగ ప్రదేశాల్లో నిద్రిస్తున్న నిరాశ్రయులను గుర్తిస్తారు. అలాంటివారిని వారు పనిచేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఉండే నైట్‌ షెల్టర్‌లకు తరలిస్తారు. గత ప్రభుత్వం అనాథలను గుర్తించడం పూర్తిగా మానేసింది.

నేరుగా సంప్రదించవచ్చు

జీవనోపాధి, ఇతరపనుల కోసం వచ్చినవారు, నిరాశ్రయులు తాత్కాలిక పునరావాసం కోసం అర్బన్‌ హోమ్‌ లెస్‌ సెంటర్లో ప్రవేశం పొందవచ్చు. దగ్గర్లోని కేంద్రానికివెళ్లి ఆధార్‌ కార్డు సహాయంతో పేరు, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్‌ కార్డు లేనివారు పేరు, అడ్రసు, ఇతర వివరాలు తెలియజేస్తే తాత్కాలిక నివాసానికి అనుమతిస్తారు. అవసరమైతే వారికి గుర్తింపు కార్డులు ఇప్పించేందుకు సహాయపడతారు.

ఈ జిల్లాలకు ఏమైంది?

ప్రతి లక్షమందికీ ఒక హోమ్లీ సెంటర్‌ ఉండాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో కనీసం 25 కేంద్రాలైనా ఏర్పాటు కావాలి. కనీసం పట్టణప్రాంతాలుగా ఉంటున్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనైనా నిర్వహించి ఉంటే కొంతమందికైనా ఆశ్రయం దొరికి ఉండేది. కానీ రెండు జిల్లాలో జిల్లాకొకటి చొప్పున మాత్రమే ఉన్నాయి. అదికూడా జిల్లా కేంద్రాల్లో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా నిధులు రాకపోవడంతో విజయనగరంలో ఉన్న నైట్‌హాల్ట్‌ కేంద్రాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌, రెడ్‌క్రాస్‌ సంస్థ సౌజన్యం, కొందరు దాతల సహకారంతో అరకొరగా నడుస్తోంది. అభాగ్యులు, అనాథలు, నిరాశ్రయులను అక్కున చేర్చుకునే మానవీయ కోణంలో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ నైట్‌ షెల్టర్ల విధానానికి రూపకల్పన చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిపట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తే అభాగ్యులకు ఆదరణ దొరుకుతుంది.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే సిద్ధంగా ఉన్నాం

జిల్లాలో ప్రస్తుతం విజయనగరం పట్టణంలో ఒకేఒక్క నైట్‌ షెల్టర్‌ నడుస్తోంది. కార్పొరేషన్‌,రెడ్‌ క్రాస్‌ సహకారంతో నడుపుతున్నాం. 40 మందివరకు ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే అవసరం మేరకు వీటిసంఖ్యను పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ రాశాము.

జీవీ చిట్టిరాజు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌, విజయనగరం.

-------------------

Updated Date - Sep 20 , 2025 | 11:38 PM