Can't change yet! ఇంకా మారలే!
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:43 PM
Can't change yet! రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నరవుతున్నా జిల్లాలో చాలామంది మీసేవ నిర్వాహకులు, వారిని పర్యవేక్షించే అధికారుల్లో వైసీపీ వాసనలు వీడినట్టు లేదు. ఇప్పటికీ జగన్ బొమ్మతో ఉన్న పాత స్టేషనరీనే వినియోగిస్తూ వైసీపీపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇంకా మారలే!
వైసీపీ ప్రచారంలో మీసేవ కేంద్రాలు
రద్దయిన స్టేషనరీతోనే లావాదేవీలు
జగన్ ఫొటోతోనే సర్టిఫికెట్లు జారీ
ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు
పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నరవుతున్నా జిల్లాలో చాలామంది మీసేవ నిర్వాహకులు, వారిని పర్యవేక్షించే అధికారుల్లో వైసీపీ వాసనలు వీడినట్టు లేదు. ఇప్పటికీ జగన్ బొమ్మతో ఉన్న పాత స్టేషనరీనే వినియోగిస్తూ వైసీపీపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రభుత్వ రాజముద్ర తప్ప ఎవరి ఫోటో లేకుండా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేషనరీ అందుబాటులో ఉన్నా వాటిని కాదని అన్నిరకాల పత్రాలకు పాతవాటినే వాడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు నటిస్తూ పరోక్షంగా స్వామిభక్తి చాటుతున్నారు.
మెంటాడ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి):
వైసీపీ హయాంలో ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరి సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా మంజూరయ్యే అన్నిరకాల ధ్రువీకరణ పత్రాల స్టేషనరీపై జగన్ రెడ్డి ఫొటో ఉండేది. కూటమి ప్రభుత్వం వాచ్చక దీన్ని మార్చింది. ప్రభుత్వ రాజముద్ర మినహా ఎవరి ఫొటోలు లేకుండా స్టేషనరీని తీసుకొచ్చింది. ఈ స్టేషనరీ సరఫరా చేసే సీఎంఎస్ ఏజెన్సీకి ఈమేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే మీసేవ కేంద్రాలు, సచివాలయాల్లో ఉన్న పాత స్టేషనరీని రద్దుచేసి కొత్త స్టేషనరీని వాడాలని స్పష్టం చేసింది. సచివాలయాల సిబ్బంది ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తుండగా, వైసీపీ వీరాభిమానులైన కొందరు మీసేవ నిర్వాహకులు మాత్రం ఇప్పటికీ పాత స్టేషనరీనే వాడుతున్నారు. జగన్ బొమ్మలతోనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. పాతబాండ్లు చెల్లుబాటు అవుతాయోలేదోనని ఎవరైనా అడిగితే మాత్రం కొత్త బాండ్లు వినియోగిస్తున్నారు.
- పాత స్టేషనరీ వినియోగం తమ దృష్టికి వచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవడంలేదు. పైగా మీసేవ నిర్వాహకుల మాటనే వీరుకూడా వల్లిస్తూ వారి తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు.
- జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల ఈతంతు యథేచ్చగా కొనసాగుతూనే ఉంది. 30 నుంచి 40 శాతం మీసేవ కేంద్రాల్లో పాత స్టేషనరీనే చెలామణి చేస్తున్నారు.
- కొందరు మీసేవ నిర్వహకులు లొకేషన్ మార్చి ఏమార్చుతున్నారు. తాము నడుపుతున్న మీసేవ కేంద్రం నుంచి కాకుండా వేరే లొకేషన్ నుంచి ఓపీఆర్ ద్వారా అప్లోడ్, డౌన్లోడ్ ప్రక్రియను నడుపుతున్నారు.
- కొందరు మీసేవ నిర్వాహకులు నిర్దేశిత రుసుముకన్నా అదనంగా వసూలు చేస్తున్నారు. ఏమంటే ప్రభుత్వంపై నెట్టేస్తూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. సచివాలయాల ఏర్పాటు అనంతరం మీసేవ కేంద్రాల్లో లావాదేవీలు తగ్గాయి. మూడొంతులు సేవలు సచివాలయాలకు అప్పగించడంతో నిర్వాహకులు తెల్లముహం వేశారు. ఆ ప్రభుత్వాన్ని నిందిస్తూ మాట్లాడేవారు. కూటమి ప్రభుత్వం సేవలను యథాతథంగా పునరుద్ధరించింది. అయినప్పటికీ కొందరు మీసేవ నిర్వాహకులు జగన్ బొమ్మను వదలకపోవడం వారి నైజాన్ని చెప్పకనే చెబుతోంది.
మేనేజర్ ఫక్తు వైసీపీ నేత!
సీఎంఎస్ ఏజెన్సీ నియమించిన మీసేవ జిల్లా మేనేజర్ ఫక్తు రాజకీయ నాయకుడు. వైసీపీ తరపున క్రియాశీలంగా వ్యవహరిస్తారు. ఈయనకు డ్యూటీకన్నా రాజకీయాలే ఎక్కువ. కలెక్టరేట్‌లో ఉన్న కార్యాలయానికి నెలలో ఒకట్రెండుసార్లు రావడం కష్టం. సంబంధిత అధికారి ఫోన్లకు లెక్కచేయరు. జిల్లాకేంద్రంలోని ఓ వైసీపీ కీలకనేత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆ నేత కార్యాలయంలోనే ఎక్కువగా ఉంటారు. మీసేవ నిర్వాహకులకు సైతం అందుబాటులో ఉండరు. పైసలిస్తేనే కొత్త కేంద్రాల ఏర్పాటుకు సిఫార్సు చేస్తుంటారు. ఈయన బినామీల పేరుమీద మూడు సెంటర్లు నడుపుతున్నారని చెప్పుకుంటున్నారు.
- కొన్నాళ్లుగా కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులపై కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిగురించి మాట్లాడేందుకు జాయింట్ కలెక్టర్ చొరవ చూపుతున్నా జిల్లా మేనేజర్ అందుబాటులో ఉండడం లేదు.