కొనలేం.. తినలేం
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:57 PM
కూరగాయల ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వాటి ధరలు పైపైకి వెళ్తున్నాయి.
- కొండెక్కిన కూరగాయలు ధరలు
- కిలో రూ.80 పలుకుతున్న బీరకాయలు, క్యారెట్
- సామాన్య, మధ్యతరగతి ప్రజల బెంబేలు
పాలకొండ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వాటి ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా ధర అందుబాటులో లేకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏం కొనలేం.. ఏం తినలేం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అధిక వర్షాలతో జిల్లాలో రైతులు కాయగూరలు పండించలేని పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు మొంథా తుఫాన్ కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. స్థానికంగా కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గత నెల వరకూ ఏ కూరగాయ ధర అయినా కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉండేది. ప్రస్తుతం అన్ని రకాల కాయగూరలు ధరలు కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం కిలో బీరకాయలు రూ.80, చిక్కుడు రూ.50, టమాటా రూ.50, క్యారెట్ రూ.80, వంకాయలు రూ.60, బీట్‌రూట్ రూ.80, దొండకాయలు రూ.50, జత కాలిప్లవర్‌లు రూ.50, కాకరకాయలు రూ.80, గోరుచిక్కుడు రూ.80, ఉల్లిపాయలు కిలో రూ.30, బంగాళాదుంపలు కిలో రూ.30 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు.
అదే కారణం..
జిల్లాలో వీరఘట్టం, జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి, సాలూరు, పాచిపెంట, మక్కువ, పార్వతీపురం తదితర మండలాల్లో వివిధ రకాల కూరగాయలను రైతులు విరివిగా పండిస్తుంటారు. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పాటు ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్‌తో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. స్థానికంగా కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల ధరలను పెంచి అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. కార్తీక మాసంలో మాంసం వినియోగం తక్కువగా ఉంటుంది. కూరగాయలనే అధికంగా వినియోగిస్తుంటారు. ఇది కూడా కూరగాయల ధరలు పెరగడానికి ఒక కారణమని వ్యాపారులు అంటున్నారు.
వినియోగం తగ్గించాం
ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు అధికంగా ఉన్నాయి. రూ.500 తీసుకెళ్తేగానీ ఆరు రకాల కూరగాయలు రావడం లేదు. ప్రస్తుతం ఏ కూరగాయ కొనాలన్నా కేజీ రూ.60 నుంచి రూ.80 ఉంటుంది. దీంతో కూరగాయల వినియోగం తగ్గించాం.
-కె.సూరీడమ్మ, పాలకొండ