రైలు కూత వినపడేనా?
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:55 PM
సాలూరు రైల్వే స్టేషన్‌కు రైలు ఎప్పుడు వస్తుందా అని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సాలూరు రైల్వేస్టేషన్‌కు రాని ట్రైన్
ట్రయల్ రన్‌తో సరిపెట్టేసిన వైనం
ఏడాది దాటినా పట్టించుకోని రైల్వే అధికారులు
రైలు బస్సు జాడ కూడా లేదు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
సాలూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సాలూరు రైల్వే స్టేషన్‌కు రైలు ఎప్పుడు వస్తుందా అని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహించి ఏడాది దాటినా ఇంతవరకు రైలుని నడపకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కరోనా సమయంలో నిలిపివేసిన రైలు బస్సును కూడా పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
బ్రిటీషు కాలంలో ఏర్పాటు చేసిన సాలూరు రైల్వే స్టేషన్ గతంలో మూతపడింది. అయితే, ప్రయాణికుల డిమాండ్ మేరకు 2004లో సాలూరు, బొబ్బిలి పట్టణాల మధ్య రైలుబస్సు సౌకర్యాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇది నడిచేది. కూలీలు, పేద, మధ్య తరగతి వర్గానికి చెందిన ప్రజలకు ప్రతిరోజూ వారి ప్రయాణానికి ఈ రైలుబస్సు ఎంతో ఉపయోగపడేది. విద్యార్థులు సైతం బొబ్బిలికి వెళ్లి ఉన్నతమైన చదువులు చదువుకునేవారు. సాలూరు, బొబ్బిలి ప్రాంతాల నుంచి విశాఖ, విజయనగరం ప్రాంతాలకు రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. అయితే ఈ రైలు బస్సును కరోనా కాలం నుంచి పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఈ రెండు పట్టణాల మధ్య గల అనేక గ్రామాల ప్రజలు విశాఖ, విజయనగరం రాకపోకలు సాగించడానికి నానా అవస్థలు పడుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా సాలూరు-బొబ్బిలి రైలు బస్సు జాడ కానరావడం లేదు. రైలు బస్సును మరలా పునరుద్ధరించేలా రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రయల్ రన్‌తో సరి..
సాలూరు నుంచి రాయగడ, విశాఖపట్నం వరకు రైలు నడపాలని 2018లో సాలూరుకు చెందిన అనేక మంది మేధావులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పట్టణ ప్రముఖులు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. దీంతో అప్పటి డీఆర్‌ఎం సాలూరు స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ అభివృద్ధి, దండిగాం రోడ్డు, కొత్తగా షెల్డర్ ఏర్పాటు, విద్యుత్‌లైన్ పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేశారు. ఆ మేరకు పనులు కూడా జరిగాయి. గతేడాది అక్టోబరు మొదటి వారంలో విశాఖపట్నం నుంచి సాలూరు రైల్వే స్టేషన్‌కు రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ రైలు కూత విని పట్టణ ప్రజలు పెద్దసంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకొని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ట్రయల్ రన్ పూర్తిచేసి సంవత్సరం దాటినా రైలుని మాత్రం నడపడం లేదు. దీంతో ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ట్రయల్ రన్ వేసిన అధికారులు ఇప్పటివరకు రైలు రాకపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్‌లను సందర్శించిన రైల్వే ఉన్నతాధికారులు మే నెలలో సాలూరుకు రైలు వస్తుందని అన్నారు. కానీ ఇంతవరకు రాలేదు. ఏడాది పూర్తవుతున్నా రైలు సేవలు పునరుద్ధరించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం స్పందించి రైలుని నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.