Can you correct the mistakes? తప్పులు సరిదిద్దేనా ?
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:45 PM
Can you correct the mistakes? గంట్యాడ మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన రైతు కశిరెడ్డి పరదేశినాయుడుకు సంబంధించిన ఆధార్ నెంబరు ఇదే మండలంలోని చినమానాపురం గ్రామానికి చెందిన పాశల చంద్రమ్మ అనే మహిళా రైతుకు చెందిన భూముల 1బీకి అనుసంధానం అయిపోయింది. వెబ్‌ల్యాండ్‌లో ఈ విధంగా కనిపిస్తోంది. వాస్తవానికి పరదేశినాయుడుకు చినమానాపురం గ్రామంలోని ఎటువంటి భూమి లేదు. దీనిని తొలగించడం కోసం పరదేశినాయుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
తప్పులు సరిదిద్దేనా ?
అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో లోపాలు
ఆఽధార్ నెంబరు ఒకరిది.. 1బీ మరొకరిది
తప్పులు తడకలుగా ఆన్‌లైన్‌లో నమాదు
ఇబ్బంది పడుతున్న రైతులు
విజయనగరం కలెక్టరేట్, జూలై 12(ఆంధ్రజ్యోతి):
- గంట్యాడ మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన రైతు కశిరెడ్డి పరదేశినాయుడుకు సంబంధించిన ఆధార్ నెంబరు ఇదే మండలంలోని చినమానాపురం గ్రామానికి చెందిన పాశల చంద్రమ్మ అనే మహిళా రైతుకు చెందిన భూముల 1బీకి అనుసంధానం అయిపోయింది. వెబ్‌ల్యాండ్‌లో ఈ విధంగా కనిపిస్తోంది. వాస్తవానికి పరదేశినాయుడుకు చినమానాపురం గ్రామంలోని ఎటువంటి భూమి లేదు. దీనిని తొలగించడం కోసం పరదేశినాయుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
జామి మండలం తానవరం గ్రామానికి చెందిన తమటపు లక్ష్మివెంకట సన్యాసిరావు తన ఆధార్ నెంబరును అన్నదాత పోర్టల్‌లో నమోదు చేసి చూస్తే గ్రామానికి చెందిన పాశల త్రినాథ్ పేరు చూపిస్తోంది. ఎందుకిలా జరిగిందో తెలియదు. జిల్లాలో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాకు ప్రభుత్వం త్వరలో నిధులు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి రైతుల వివరాలను రైతు సేవ కేంద్రాల్లో పనిచేసే వ్యవసాయ అసిస్టెంట్లు నమోదు చేశారు. ఇప్పటికే సంబంధిత రైతులకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వెబ్‌ల్యాండ్‌లో రైతుల వివరాలు అటుఇటుగా మారిపోయి కనిపిస్తున్నాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 2, 46,000 మంది రైతులు ఉన్నారు. వీరిలో 2,20,000 మంది వరకూ అన్నదాత సుఖీభవ పోర్టల్ నమోదు అయినట్లు అధికారిక లెక్కలు చెబుగున్నాయి. అయితే వ్యవసాయ శాఖ రూపొందించిన పోర్టల్‌లో పథకానికి అర్హులు, అనర్హుల వివరాలను ఆధార్ నెంబరు ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే సమస్యలు బయటపడుతున్నాయి. రైతులు తమ ఆధార్ నెంబరు ద్వారా చెక్ చేసుకున్న సమయంలో కొందరి వివరాలు తప్పులుగా కన్పిస్తున్నాయి. ఆధార్ ఒకరి పేరు ఉంటే, 1బీ మరొకపేరు కన్పిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయా రైతులు గ్రామ సచివాలయాలు, మండల రెవెన్యూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుతున్నారు. ఈ తప్పు సచివాలయ సిబ్బంది చేశారా? రెవెన్యూ అధికారులు చేశారా? అనేదానిపై వారికి స్పష్టత లేదు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఈనెల 13వ తేదీలోగా గ్రీవెన్స్ మాడ్యూల్‌లో అవకాశం కల్పించారు. అయితే ఆధార్ నెంబరు మార్పులకు మాత్రం అవకాశం లేదు. ఈ సమస్యలు పరిష్కారం కావడానికి కొంత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సచివాలయం సిబ్బందికి బదిలీలు జరిగాయి. చాలా మంది స్థానాలు మారారు. స్థానిక సమస్యలను వారు అవగాహన చేసుకోవడానికి సమయం పట్టొచ్చుననేది కొందరు రైతుల ఆవేదన. ఇదే విషయమై జిల్లా వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావు వద్ద ప్రస్తావించగా ఆధార్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని, రెండో విడతలో వారికి నిధులు విడుదలవుతాయని వెల్లడించారు.