Can the canals change? కాలువలు మారేనా?
ABN , Publish Date - May 02 , 2025 | 12:21 AM
Can the canals change? జిల్లాలో విజయనగరంతో పాటు ఇతర పట్టణాలు, నగర పంచాయతీల్లో కాలువలు పూడికపోయి దుర్గంధం అలముకోవడం నిత్య సమస్యగా తయారైంది. కాలువల్లో నీరు వెళ్లే మార్గం సరిగా లేక దుర్వాసనతో కూడిన నీరు రోడ్లపైకి రావడం తరచూ ఉత్పన్నమవుతున్న సమస్యే.
కాలువలు మారేనా?
పట్టణాలు, నగరాల్లో నేటి నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం
నెల రోజుల పాటు కొనసాగింపు
మొదటి 15 రోజులు ప్రధాన రహదారి వెంట కాల్వల్లో పూడిక తీత
రెండో పక్షమంతా వీధి కాల్వలపై దృష్టి
ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాలో విజయనగరంతో పాటు ఇతర పట్టణాలు, నగర పంచాయతీల్లో కాలువలు పూడికపోయి దుర్గంధం అలముకోవడం నిత్య సమస్యగా తయారైంది. కాలువల్లో నీరు వెళ్లే మార్గం సరిగా లేక దుర్వాసనతో కూడిన నీరు రోడ్లపైకి రావడం తరచూ ఉత్పన్నమవుతున్న సమస్యే. దీనివల్ల అటుగా రాకపోకలు సాగించే వారితో పాటు స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమీపస్తులు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. కాలువల దుస్థితిని గుర్తించిన ప్రభుత్వం వాటి రూపు మార్చాలని సంకల్పించింది. నెలరోజుల పాటు పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. శుక్రవారమే ఇందుకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా తొలుత రహదారి వెంట కాలువల్లోనూ, తర్వాత వీధి కాలువల్లోనూ పూడిక తీత పనులు చేపడ్తారు.
నెల్లిమర్ల, మే 1(ఆంధ్రజ్యోతి):
విజయనగరం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో శుక్రవారం నుంచి పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమానికి(శానిటేషన్ స్పెషల్ డ్రైవ్) ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నెల రోజుల పాటు ప్రధాన రహదారుల పక్కనున్న కాలువలతోపాటు వీధి కాల్వల్లో పూర్తిస్థాయిలో పూడికతీత పనులు చేపట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. మే 1న చేపట్టాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ మేడే వల్ల 2వ తేదీకి వాయిదా వేసింది. మొదటి 14 రోజులూ ప్రధాన రహదారి పక్కనున్న కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టనున్నారు. మే 16 నుంచి 31వ తేదీ వరకు వీధుల్లో ఉన్న కాలువలపై దృష్టిసారిస్తారు. ఈ ప్రక్రియలో శాశ్వత నిర్మాణాలు అడ్డుగా ఉంటే గనుక తొలగింపునకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- కాలువలపై అక్రమ నిర్మాణాలు ఉండడం వల్ల వాటిలో పేరుకుపోయిన మురుగును తొలగించడానికి పారిశుధ్య కార్మికులు అవస్థలు పడుతున్నారు. వీలు కాని చోట మురుగును అలాగే వదిలేస్తున్నారు. దీనివల్ల భరించలేని దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టేందుకు మే నెల సరైన సమయంగా భావించింది. వేసవి తర్వాత వచ్చే వర్షాకాలం వరద నీటి వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా చూడాలని నిర్ణయించింది. కాల్వలను ఇప్పుడే శుభ్రం చేయాలని తలచింది. ఈ మేరకు పురపాలక శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు.
దుకాణ యజమానులకు ఇప్పటికే సమాచారం
కాలువలపై అక్రమ నిర్మాణాలున్న దుకాణ యజమానులకు వార్డు సచివాలయ సిబ్బంది మౌఖికంగా తెలియజేశారు. కాల్వల్లో పూడిక తీత పనులు చేపడుతున్నామని, అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే ఎక్సకవేటర్‌తో తామే బలవంతంగా తొలగిస్తామని కూడా ముందస్తు సమాచారం ఇచ్చారు. పూడికతీత పనుల తర్వాత అవసరమైన చోట కాలువలపై శాశ్వత నిర్మాణాలు లేకుండా ఎప్పటికప్పుడు తెరుచుకునేలా పలకలు వేసుకునే విధానం తెచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండో పక్షంలో మే 16 నుంచి 31వ తేదీ వరకు వీధుల్లోని కాల్వలపై దృష్టి సారించనున్నారు. వీధుల్లో కూడా అవసరమైతే పూడిక తీత పనులకు ఆటంకంగా ఉన్న చోట కాల్వలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తారు.
మధ్యాహ్నం 3 నుంచి..
పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీ కమిషనర్ల పర్యవేక్షణలో వార్డు సచివాలయాల పారిశుధ్య కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుద్య కార్మికులు నిర్వహిస్తారు. ప్రతి పట్టణం, నగరాల్లో ఉదయం పూట పారిశుధ్య కార్మికులు యథావిఽధిగా ఇళ్లల్లో పేరుకుపోయిన చెత్త సేకరణ విధులకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ పనులకు హాజరవుతారు. అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ఆయా కమిషనర్‌లు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. కాలువల్లో అక్రమ కట్టడాలను తొలగించేటప్పుడు వచ్చే తిరుగుబాట్లు ,అసంతృప్తులు, ఇతర సమస్యలను సైతం ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
- ప్రత్యేక డ్రైవ్‌కు బయట వ్యక్తులను వినియోగించకుండా ఆయా పురపాలక, నగర పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న పారిశుధ్య సిబ్బందినే వినియోగించాలని రాష్ట్ర పురపాలక సంఘ అధికారులు ఆదేశించారు.
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం
ఎ.తారక్‌నాథ్, కమిషనర్, నెల్లిమర్ల నగర పంచాయతీ
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం. కాలువలపై ఉన్న శాశ్వత నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపడతాం. పూడికతీత పనులు శత శాతం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. నెల్లిమర్ల నగరపంచాయతీలో ఉన్న పారిశుధ్య కార్మికులను రెండు గ్రూపులుగా విభజించాం. మొదట 15 రోజులు మెయిన్‌రోడ్డు పక్కనున్న కాల్వలు, తర్వాత 15 రోజులు వీధుల్లో ఉన్న కాల్వల్లో పూడిక తీత పనులు చేపడతాం. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.