Can do it… or not? కట్టగలరో.. లేదో?
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:09 AM
Can do it… or not? జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందు కోవడం లేదు. పనుల్లో కదలిక ఉండడం లేదు. నిర్మాణాల వేగవంతానికి కూటమి ప్రభుత్వం అదనంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించినా.. ఏ మాత్రం పరిస్థితి మారలేదు. డబ్బులు తీసుకున్న వారిలో అతికొద్దిమంది మాత్రమే నిర్మాణాలు పూర్తి చేశారు.
జగనన్న కాలనీల్లో ఊపందుకోని ఇళ్ల నిర్మాణాలు
వివిధ కారణాలతో ముందుకు రాని లబ్ధిదారులు
నోటీసులు ఇస్తున్న అధికారులు
నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో స్థలాలు..మౌలిక వసతులు కరువు
దృష్టి సారించని గత వైసీపీ సర్కారు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
పార్వతీపురం, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందు కోవడం లేదు. పనుల్లో కదలిక ఉండడం లేదు. నిర్మాణాల వేగవంతానికి కూటమి ప్రభుత్వం అదనంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించినా.. ఏ మాత్రం పరిస్థితి మారలేదు. డబ్బులు తీసుకున్న వారిలో అతికొద్దిమంది మాత్రమే నిర్మాణాలు పూర్తి చేశారు. వివిధ కారణాలతో పనులు చేపట్టని వారికి అధికారులు నోటీసులు అందిస్తున్నారు. డబ్బులు తిరిగివ్వడమో.. ఇంటి నిర్మాణ స్థాయి మార్చడమో? చేయాలని స్పష్టం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో..
వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం నివాసయోగ్యం కాని సుదూర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. గెడ్డలు, కొండవాగులు, శ్మశానవాటికలు, చెరువులు, అటవీ ప్రాంత సమీపంలో అవి ఉండడం, నిధులు చాలకపోవడంతో చాలామంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ఆసక్తి చూపలేదు. పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న నాటి ప్రభుత్వం మాట మార్చేసింది. జగనన్న కాలనీల అభివృద్ధిపై దృష్టి సారించలేదు. రోడ్లు, కాలువలు ఇతర మౌలిక వసతులు కల్పించలేదు. అధికారుల ఒత్తిడితో అతికొద్దిమంది మాత్రమే అప్పులు చేసి పనులు చేపట్టారు. అయినప్పటికీ చాలా ఇళ్లు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో 401 జగనన్న లేఅవుట్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో 17,465 ప్లాట్లు వేశారు. 10,623 ఇళ్లు మంజూరు చేయగా.. ఇందులో 371 గృహ నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. కేవలం గుంతలు తవ్విన ఇళ్లు 2,235 ఉండగా, బీబీఎల్ స్టేజ్‌లో 130, పీబీ స్టేజ్‌లో 732 , బీఎల్ స్టేజ్‌లో 1692, ఎల్‌ఎల్ స్టేజ్‌లో 2,146, ఆర్‌ఎల్ స్టేజ్‌లో 46, ఆర్‌సీ స్టేజ్‌లో 105 ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు 2,806 గృహ నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. పార్వతీపురం పట్టణ లబ్ధిదారులకు సంబంధించి 25 లేఅవుట్లలో 3,871 ప్లాట్లు వేశారు. ఇందులో 1,740 ఇళ్లు మంజూరు కాగా, 337 గృహ నిర్మాణాలే పూర్తయ్యాయి. సాలూరు పట్టణానికి సంబంధించి 8 లేఅవుట్లలో 2,662 ప్లాట్లు వేశారు. 1997 మందికి స్థలాలు అందించారు. అయితే కేవలం 202 ఇళ్ల నిర్మాణాలే పూర్తయ్యాయి. పాలకొండ నగర పంచాయతీలో 1164 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సాలూరు పట్టణంలో సుమారు 373 మంది లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను తిరిగిచ్చేశారు. నివాసాలకు అనుకూలంగా లేని చోట గృహ నిర్మాణాలు చేపట్టలేమని తేల్చిచెప్పారు. పార్వతీపురం పట్టణంలో జగనన్న కాలనీల కోసం సేకరించిన ఇంటి స్థలాలు అప్పట్లో కొంతమంది రెవెన్యూ అధికారులు, భూములు విక్రయించిన వారికి లాభాలు వచ్చాయి తప్ప పేదల సొంతింటి కల మాత్రం నెరవేరలేదు. ఇకపోతే గృహ నిర్మాణ శాఖలో కీలక పోస్టు లను భర్తీ చేయడం లేదు. జిల్లా మేనేజర్‌తో పాటు డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా హౌసింగ్ మేనేజర్‌గా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఽధర్మచంద్రారెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహి స్తున్నారు. పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణాలపై పర్యవేక్షణ కొరవడింది.
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించింది. నిర్మాణాల వేగం పెంచేందుకు ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50 వేల చొప్పున అదనంగా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు జిల్లాలో 3,618 మంది లబ్ధిదారులకు రూ.8.19 కోట్లు అందించారు. అయితే ఇప్పటివరకు కేవలం 808 మాత్రమే గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలిన వారు పనులు చేపట్టలేదు. దీంతో అదనపు ఆర్థిక సాయం పొందినా ఇళ్లు నిర్మాణాలు చేపట్టని వారికి అధికారులు తాజాగా నోటీసులు అందిస్తున్నారు. అయితే అదనపు సాయం పొందిన లబ్ధిదారులు ఆర్థిక స్థితి అనుకూలించక.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం డబ్బులను తిరిగి ఎలా ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
నోటీసులు అందిస్తున్నాం
గృహ నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలని లబ్ధిదారులకు అదనంగా ఆర్థికసాయం అందిం చాం. అయితే చాలామంది నేటికీ పనులు ప్రారంభించలేదు. ఇటువంటి వారికి నోటీసులు అందిస్తున్నాం. ఇల్లు కడతారో.. డబ్బులు తిరిగిస్తారో లబ్ధిదారులే తేల్చుకోవాలి.
- ధర్మ చంద్రారెడ్డి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, జిల్లా గృహ నిర్మాణశాఖ ఇన్‌చార్జి అధికారి