Share News

Never Returned.. సెలవులకు ఇంటికి వచ్చి.. తిరిగిరాని లోకాలకు..

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:22 AM

Came Home for Holidays.. But Never Returned.. దసరా సెలవుల కావడంతో ఆ బాలికలు ఇళ్లకు వచ్చారు. స్నానానికి నీటి గుంట వద్దకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో అందులో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. దీంతో తల్లిదండ్రులు కన్నీ

  Never Returned.. సెలవులకు ఇంటికి వచ్చి.. తిరిగిరాని లోకాలకు..
నీటిగుంట ఇదే

సీతంపేట రూరల్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): దసరా సెలవుల కావడంతో ఆ బాలికలు ఇళ్లకు వచ్చారు. స్నానానికి నీటి గుంట వద్దకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో అందులో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన సోమవారం సీతంపేట మండలంలోకి చోటుచేసుకుంది. పెద్దగూడ పంచాయతీ పరిధి అచ్చెబ గ్రామానికి చెందిన కొండగొర్రి మౌనిక(12), పాలక రాజీ (అంజలి(11) ముత్యాలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 7, 6 తరగతులు చదువుతున్నారు. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి శనివారం స్వగ్రామానికి చేరుకున్నారు. సోమవారం గ్రామంలో తోటి పిల్లలతో వారు సరదాగా గడిపారు. అనంతరం చెల్లెళ్లు శ్రావ్య, నిశితతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న నీటి గుంటలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే అందులో దిగిన మౌనిక, అంజలి ఒక్కసారిగా మునిగిపోయారు. ఇది గమనించిన శ్రావ్య, నిశిత కేకలు వేసుకుంటూ గ్రామంలోకి పరుగులు తీశారు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు హుటాహుటిన నీటి గుంట వద్దకు చేరుకుని బాలికల కోసం గాలించారు. అయితే ప్రయోజనం లేకపోయింది. మౌనిక, అంజలి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. కొండగొర్రి వల్లభరావు, సుశీల దంపతులకు ముగ్గురు సంతానం కాగా వీరిలో మౌనిక రెండో కుమార్తె. పాలక రాజారావు, సుజాత దంపతులకు ముగ్గురు సంతానంలో అంజలి పెద్ద కుమార్తె. తోటి పిల్లలతో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా గడిపిన తమ పిల్లలు ఆకాల మరణం చెందడంతో బాలికల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో అచ్చెబ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సీతంపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ మస్తాన్‌ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:22 AM