అద్దెంటి కోసం వచ్చి.. వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లారు!
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:03 AM
Came Asking for Rent.. Snatched Chain from Elderly Woman! అద్దెంటి కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ వృద్ధురాలి మెడలో బంగారు గెలుసు లాక్కెళ్లారు. అనంతరం బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనతో సాలూరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
గాలింపు చర్యల్లో పోలీసులు
సాలూరు, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి): అద్దెంటి కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ వృద్ధురాలి మెడలో బంగారు గెలుసు లాక్కెళ్లారు. అనంతరం బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనతో సాలూరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరులోని రామాకాలనీలోని ఓ ఇంటిలో అక్కివరపు సత్యవతి అనే వృద్ధురాలు ఒంటరిగానే ఉంటోంది. కొన్నేళ్ల కిందట భర్త చనిపోగా.. కూతరుకు వివాహం చేసింది. ప్రస్తుతం ఆమె పెందూర్తిలో ఉంటుంది. కాగా తన పక్కనున్న ఇంటిని అద్దెకివ్వాలని వృద్ధురాలు నిర్ణయించింది. కాగా సోమవారం ఓ వ్యక్తి టోపీ పెట్టుకుని, మరో వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని సత్యవతి దగ్గరకు వచ్చారు. అద్దెకు ఇల్లు కావాలని లోపలంతా చూపించాలని అడిగారు. దీంతో వృద్ధురాలు ఇంటిలోని బెడ్‌రూంలోకి వెళ్లగా.. హెల్మెట్ వేసుకున్న వ్యక్తి ఆమె రెండు చేతులనూ గట్టిగా పట్టుకున్నాడు. టోపీ వేసుకున్న వ్యక్తి సత్యవతి మెడలో ఉన్న సుమారు ఐదు తులాల బంగారు గొలుసును తెంపి కిందకు నెట్టేశాడు. వెంటనే వారు అక్కడి నుంచి బయటకు వచ్చి బైక్‌పై పరారయ్యారు. బాధితురాలు తేరుకుని.. గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. వెంటనే ఆమె పట్టణ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘటనను తెలపగా.. అప్రమత్తమైన పోలీసులు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల ఫొటోలను బయటకు తీశారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బి.అప్పలనాయుడు తెలిపారు.