Share News

New Teachers కొత్త గురువులకు పిలుపు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:12 AM

Call for New Teachers మెగా డీఎస్సీలో కొలువు సాధించిన కొత్త గురువులకు విద్యాశాఖ పిలుపునందించింది. దీంతో వారు బుధవారం విజయవాడకు చేరుకో నున్నారు. 25న ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు.

 New Teachers కొత్త గురువులకు పిలుపు

  • రేపు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

  • ఉమ్మడి జిల్లాలో భర్తీ కానున్న 578 టీచర్‌ పోస్టులు

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో కొలువు సాధించిన కొత్త గురువులకు విద్యాశాఖ పిలుపునందించింది. దీంతో వారు బుధవారం విజయవాడకు చేరుకో నున్నారు. 25న ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు. వాస్తవంగా ఈనెల 19న ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే విజయవాడలో భారీ వర్షాల కారణంగా చివరి క్షణంలో వాయిదా వేశారు. కొలువు సాధించిన ఉపాధ్యాయుడుతో పాటు మరొకరు సహాయకులను తీసుకొని డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్‌ ఇంటర్నేషన్‌ స్కూల్‌కు చేరుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్‌లో బుధవారం ఉదయం ఆరు గంటలకు రిపోర్ట్‌ చేయాలి. మోదవలస నుంచి విజయవాడ వెళ్లి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందుకోనున్నారు. కొత్త గురువులు, వారితో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా విజయవాడలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సమావేశ ప్రాంగణంలోకి ఏయే జిల్లాలు ఏ గేట్‌ నుంచి రావాలో మార్గదర్శకాలు జారీ చేశారు.

40 బస్సులు

కొత్త గురువులు, వారి సహాయకులను మోదవలస నుంచి విజయవాడకు తీసుకెళ్లడానికి ఉమ్మడి జిల్లా నుంచి 40 బస్సులు ఏర్పాటు చేసినట్టు మన్యం జిల్లా ఆర్టీసీ డీటీపీవో వెంకటేశ్వర రావు మంగళవారం తెలిపారు. సాలూరు డిపో నుంచి 6, పార్వతీపురం 5, పాలకొండ 6, విజయనగరం జిల్లా నుంచి 17 బస్సులు ఈ నెల 24న మోదవలస నుంచే బయలు దేరుతాయన్నారు. మరో రెండు బస్సులు స్పేర్‌గా ఉంచుతామని వెల్లడించారు.

578 టీచర్‌ పోస్టులు భర్తీ

ఉమ్మడి జిల్లాలో 578 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో 266 ఎస్జీటీలు, పాఠశాల సహాయకుల విభాగంలో సోషల్‌ స్టడీస్‌ 67, ఫిజిక్స్‌ 56, బయాలజీ 36, గణితం 33, తెలుగు 14, హిందీ 14, ఆంగ్లం 30, ఫిజికల్‌ డైరెక్టర్‌ 62 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారిలో 257 మంది మహిళలు టీచర్‌ పోస్టులు సాధించారు. పాఠశాల సహాయకుల హిందీ విభాగంలో 14 పోస్టులకు గాను 12 పోస్టులను మహిళలే దక్కించుకున్నారు. మేనేజ్‌మెంట్‌ వారీగా విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 14, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో 55, జడ్పీ, ఎంపీపీ స్థానిక సంస్థల్లో 372, గిరిజన సంక్షేమశాఖలో 137 టీచర్‌ పోస్టులను మెగా డీఎస్సీలో ఎంపికైన వారితో భర్తీ చేయనున్నారు. కొత్త గురువులు విజయవాడలో పోస్టింగ్‌ ఆర్డర్‌ స్వీకరణ అనంతరం శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్‌ జరిపి పాఠశాలలు కేటాయించనున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:12 AM