Share News

నిరుపయోగంగా కేజ్‌ కల్చర్‌

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:52 PM

పాచిపెంట సమీపంలోని పెద్దగెడ్డ జలాశయంలో ఏర్పాటు చేసిన కేజ్‌ కల్చర్‌ నిరుపయోగంగా మారింది.

నిరుపయోగంగా కేజ్‌ కల్చర్‌
పెద్దగెడ్డ జలాశయంలో నిరుపయోగంగా ఉన్న కేజ్‌ కల్చర్‌

- ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

పాచిపెంట, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట సమీపంలోని పెద్దగెడ్డ జలాశయంలో ఏర్పాటు చేసిన కేజ్‌ కల్చర్‌ నిరుపయోగంగా మారింది. గత ఆరేళ్లుగా దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వం పెద్దగెడ్డ జలాశయంలో ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో కేజ్‌ కల్చర్‌ ఏర్పాటు చేసింది. 2006లో గుజరాత్‌ నుంచి తిలాఫియా చేప పిల్లలు తెప్పించి పెంపకం చేపట్టారు. ఇందుకోసం మత్స్యశాఖ ద్వారా సుమారు రూ. 35 లక్షలు వెచ్చించారు. పెరిగిన చేపలను మత్స్యకారులు సులభంగా పట్టుకునే వారు. వారి జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మత్స్యకారులు రూ.500 చెల్లిస్తే టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి సైకిల్‌, వల మంజూరు చేసింది. అయితే 2019 తరువాత ప్రభుత్వం మారడంతో సీన్‌ మారిపోయింది. వైసీపీ సర్కార్‌ కేజ్‌ కల్చర్‌ నిర్వహణ గాలికొదిలేసింది. దీంతో తిలాఫియా చేపలు పెంపకానికి మంగళం పాడింది. ఫలితంగా మత్స్యకారులు ఉపాధికి దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై మత్స్యకార సంఘ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. జలాశయానికి సంబంధించి శ్రీపెద్దగెడ్డ గిరిజన స్వదేశీ మత్స్యకార సంఘంలో 164 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీ హయాంలో కేజ్‌ కల్చర్‌ ఏర్పాటయిందని, దీని నిర్వహణపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నమ్మకం సంఘ సభ్యుల్లో దృఢంగా ఉంది. కేజ్‌ కల్చర్‌పై దృష్టి సారించి మళ్లీ చేప పిల్లల పెంపకాన్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.

ఉపాధి కోల్పోయాం

కేజ్‌ కల్చర్‌ నిరుపయోగంగా ఉంది. దీంతో గత ఆరేళ్లుగా ఉపాధి అవకాశాలు కోల్పోయాం. తగిన సౌకర్యాలు లేకపోవడంతో వేటకు వెళ్లాలంటే భయంగా ఉంది. గతంలో లైఫ్‌ జాకెట్లు లేక ముగ్గురు మత్స్యకారులు చేపలు పడుతుండగా జలాశయంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి కేజ్‌ కల్చర్‌ను వినియోగంలోకి తీసుకురావాలి.

-బచ్చల జోగిరాజు, మడవలస, మత్స్యకార సంఘం అధ్యక్షుడు

Updated Date - Sep 14 , 2025 | 11:52 PM