Share News

Businessmen everywhere అంతటా వ్యాపా‘రూలు’

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:00 AM

Businessmen everywhere కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఉద్దేశంతో వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. ఈ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా అసలు జీఎస్టీ తగ్గలేదని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ వస్తువులైన టీవీలు, ఫ్రీజ్‌లు, ఆటోమొబైల్స్‌కి చెందిన కార్లు, బైకులు, ధరలు తగ్గాయని అటు జీఎస్టీ అధికారులు, ఇటూ ప్రజాప్రతినిధులు తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు.

Businessmen everywhere అంతటా వ్యాపా‘రూలు’

అంతటా వ్యాపా‘రూలు’

జీఎస్‌టీని పట్టించుకోని అమ్మకందారులు

పన్ను తగ్గినా.. ధరలో కనిపించని వ్యత్యాసం

పాతధరలతోనే నిత్యావసరాలు, స్టేషనరీ, ఔషధాల విక్రయం

నిరాశలో కొనుగోలుదారులు

విజయనగరం రింగురోడ్డు, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి):

‘కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఉద్దేశంతో వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. ఈ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా అసలు జీఎస్టీ తగ్గలేదని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ వస్తువులైన టీవీలు, ఫ్రీజ్‌లు, ఆటోమొబైల్స్‌కి చెందిన కార్లు, బైకులు, ధరలు తగ్గాయని అటు జీఎస్టీ అధికారులు, ఇటూ ప్రజాప్రతినిధులు తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన ఔషధాలు, స్టేషనరీ ఐటెమ్స్‌, నిత్యావసర వస్తువుల ధరలు, సిమెంట్‌ ధరల్లో మార్పు లేదంటున్నారు. పాత ధరలే ఇంకా కొనసాగుతున్నాయంటున్నారు. అటుజీఎస్టీ అధికారులు, ఔషధ నియంత్రణ, ఇతర సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. నిబంధనల ప్రకారం తగ్గిన జీఎస్టీ ధరల బోర్డులను ప్రతి వ్యాపార కేంద్రం వద్ద ఉంచాలి. ఇది ఎక్కడా జరగడం లేదు. నేటికీ వ్యాపారులు నచ్చిన ధరలకే అమ్ముతున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, స్టేషనరీ వస్తువులు, పాల ఉత్పత్తులు, ఔషధాలపై జీఎస్టీ తగ్గించింది. ఆ ప్రయోజనం వినియోగదారులకు చేరడం లేదు. ప్రభుత్వం దయచూపినా వ్యాపార వర్గాలు పాత ధరలకే విక్రయిస్తూ పన్ను తగ్గింపు ప్రయోజనాల్ని తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నాయి. ఏదైనా ఒక వస్తువుపై పన్ను పెరిగినా, ఉత్పత్తి వ్యయం స్వల్పంగా పెరిగినా, లేక రవాణా ఖర్చులు పెరిగినా, తక్షణం అమాంతం ధరలు పెంచే వ్యాపారస్థులు ప్రభుత్వం పన్నుతగ్గించి సామాన్యుడికి మేలు చేయాలని చూస్తే ఆ తగ్గింపును అమలు చేయడంలో ఆలసత్వం ప్రదర్శిస్తున్నారు. కొత్త స్టాకు వచ్చేవరకూ పాత ధరలకే విక్రయిస్తామని చెప్పడం ఒక సాకుగా మారింది. నిజానికి పన్ను తగ్గింపు అనేది వినియోగదారుడు కొనుగోలు చేసిన తేదీ నుంచి అమలు కావాలి. మార్కెట్లో ఎక్కడచూసినా జీఎస్టీ తగ్గింపు తరువాత కూడా బస్తా సిమెంట్‌ ధర, ఒక కిలో పప్పు ధర, సాధారణ పెన్సిల్‌ ధర, జ్వరం మాత్ర ధరలో ఎలాంటి మార్పు లేదు.

- బైకులు, కార్లు, ఎల్‌ఈడీ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించారు. వీటికి జీఎస్టీని అమలు చేస్తున్నారు కాని సామాన్యుడికి అవసరమైన నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ ధరల్లో ఎటువంటి వ్యత్యాసం లేదు. పాత ధరలే ఉన్నాయి.

- విద్యార్థులకు అవసరమైన పెన్సిళ్లు, ఎరైజర్లు, ఎక్సైరసైజు పుస్తకాలు, క్రెయాన్స్‌, మ్యాపులు, చార్ట్‌లు, గ్లోబులు, కాటన్‌ లు తదితర వాటిపై 12 నుంచి 0కు జీఎస్టీని కేంద్రం తగ్గించింది. అయినప్పటికీ పాత ధరలే కొనసాగుతున్నాయి. జీరో శాతం అంటే స్టేషనరీ ఐటెమ్స్‌ ధర చాలా వరకూ తగ్గాలి. కానీ వ్యాపారులు పట్టించుకోవడం లేదు.

- హైరాయిల్స్‌, బేబీ నాప్‌కిన్స్‌, టూత్‌ బ్రెష్‌, షేవింగ్‌ క్రీమ్స్‌, టాయిలెట్‌ సబ్బులు, జాము, కెచప్స్‌, శాస్‌, డ్రై ఫ్రూట్స్‌, పాల ఉత్పత్తులపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించారు కాని పెద్ద, పెద్ద మార్టుల్లో ఈ తగ్గింపు ధర అమలవుతోంది. మధ్యస్థాయి కిరణా దుకాణాల్లో ఎక్కడా తగ్గింపు ధరలు మచ్చుకైనా కానరావడం లేదు. దీంతో సగటు కుటుంబానికి పన్ను ప్రయోజనం చేకూరడం లేదు.

మందుల్లోనూ మాయాజాలం

ఔషధాలపై 12 శాతం ఉన్న జీఎస్టీ 5 శాతానికి తగ్గించింది. అయితే మెడికల్‌ షాపుల యాజమానులు ధరలు తగ్గించడం లేదు. గతంలో మెడికల్‌ దుకాణాల్లో రూ.5 వేల మందులు కొనుగులు చేస్తే రూ.250 నుంచి రూ.600 వరకూ జీఎస్టీ ఉండేది. ప్రస్తుతం కేంద్రం పూర్తిగా మినహాయించినా ఆ ప్రయోజనం వినియోగదారుడికి అందడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా నడుస్తున్న మెడికల్‌ షాపుల్లో ఎంఆర్‌పీనే అమలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లోనూ మెడికల్‌ షాపులకు జీఎస్టీ వర్తించందంటూ అధిక ధరలకు మందులు అమ్ముతున్నారు. పైగా బిల్లులు ఇవ్వడం లేదు.

అధికారులు తనిఖీలు చేయాలి

సత్తి అచ్చిరెడ్డి, వినియోగదారుడు

ప్రభుత్వం జీఎస్టీ ధరలను తగ్గించడం అభినందనీయం కాని క్షేత్రస్థాయిలో ఎక్కడా తగ్గింపు ధరలు అమలు కావడం లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకులైన పాల ఉత్పత్తులు, స్టేషనరీ ఐటెమ్స్‌, ఔషధ ధరలు, సిమెంట్‌ ధరలు తగ్గించినా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదన్నదే అసలు ప్రశ్న. జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారస్థుల జేబులు నిండుతున్నాయ్‌ తప్ప సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరడంలేదు. దీనిపై సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కఠినంగా వ్యవహరించాలి.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

నిర్మలాజ్యోతి, డిప్యూటీ కమిషనర్‌, వాణిజ్య పన్నులశాఖ, విజయనగరం

సీజీఎస్టీ చట్టం సెక్షన్‌ 171 ప్రకారం జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనం తక్షణమే వినియోగదారుడికి అందజేయాలి. జీఎస్టీ తగ్గింపు ధరలు చెబుతూ ప్రతి వ్యాపారస్థుడు బోర్డులను బయట డిస్‌ప్లే చేయాలి. తగ్గింపు ధరలను ఎవరైనా అమలు చేయకపోతే ఫిర్యాదు చేయాలి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వాట్సాప్‌ నంబర్‌ 88000 01915కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

================

Updated Date - Oct 05 , 2025 | 12:00 AM