Share News

రక్తంతో వ్యాపారమా?

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:07 AM

ఇది ఒక పైడితల్లి పరిస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. జిల్లాలో అవసరానికి తగ్గట్టు రక్తసేకరణ జరగడం లేదు

రక్తంతో వ్యాపారమా?

- కొన్ని ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకుల ఇష్టారాజ్యం

- సేవ ముసుగులో దందా

- పాటించని నిబంధనలు

- కానరాని అధికారుల తనిఖీలు

- రాజాం పట్టణానికి చెందిన పైడితల్లి అనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. శరీరంలో రక్తం శాతం తగ్గడమే దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. మూడు యూనిట్లు అవసరమని గుర్తించారు. పైడితల్లి కుటుంబ సభ్యులు ప్రైవేటు రక్తనిధి కేంద్రానికి వెళ్లగా రూ.1500అని చెప్పారు. మరో కేంద్రానికి వెళితే రూ.1000 అని చెప్పడంతో తీసుకున్నారు. మరుసటి రోజు మరో ప్యాకెట్‌కి వెళితే రూ.1200 తీసుకున్నారు. మూడో రోజు డోనర్‌ కార్డు పట్టుకుని వేరే బ్లడ్‌ బ్యాంకు వెళితే రూ.800 తీసుకున్నారు.

రాజాం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇది ఒక పైడితల్లి పరిస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. జిల్లాలో అవసరానికి తగ్గట్టు రక్తసేకరణ జరగడం లేదు. రక్తదాతలు ముందుకు రావడం లేదు. సేవ ముసుగలో రక్తనిధి కేంద్రాలు వ్యాపార మార్గాలుగా మారిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రక్తాన్ని విక్రయిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 9 రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు కేవలం రెండు మాత్రమే. చీపురుపల్లిలో రూ.80 లక్షలతో భవన నిర్మాణం పూర్తయినా కేంద్రం సేవలను మాత్రం ప్రారంభించలేదు. ప్రైవేట్‌ రక్తనిధి కేంద్రాలు ఏడు వరకు ఉండగా, రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు 11 వరకూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలతో పాటు డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కువ మందిలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. ఈ క్రమంలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అండగా నిలవాల్సిన బ్లడ్‌ బ్యాంక్‌లు అవసరానికి దోపిడీకి పాల్పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

కానరాని నిబంధనలు..

బ్లడ్‌ బ్యాంకులు నిబంధనలు పక్కాగా పాటించాలి. అందుబాటులో ఉన్న రక్తం, గ్రూపులు, ధరలు, సంప్రదించాల్సిన నెంబర్లను బోర్డులో రాసి ఉంచాలి. సంబంధిత వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలి. రక్తం ప్యాకెట్లకు ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. తాజా మార్గదర్శకాల ప్రకారం రక్తం లేదా రక్త విభాగాలకు రూ.250 నుంచి రూ.1550 వరకూ మాత్రమే వసూలు చేయాలి. ఈ మేరకు రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆదేశించింది. కానీ, జిల్లాలో చాలా బ్లడ్‌ బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ కొరత సృష్టించి అధికంగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

అధికంగా కొరత..

జిల్లాలో రక్తం కొరత అధికంగా ఉంది. అవసరానికి తగ్గట్టు దాతలు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వందల యూనిట్లు అవసరం కాగా.. పదుల సంఖ్యలో యూనిట్ల సేకరణే జరుగుతోంది. జిల్లాలో రెడ్‌క్రాస్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన పెంచుతున్నా ఆ స్థాయిలో రక్తదానానికి ప్రజలు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ఒక వ్యక్తి శరీరంలో 4,500 నుంచి 5,700 మిల్లీలీటర్ల మధ్య రక్తం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. 18 ఏళ్ల వయసు నుంచి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే..జీవితకాలంలో దాదాపుగా 168 సార్లు రక్తదానం చేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

జిల్లాలో అవసరానికి తగ్గట్టు రక్తసేకరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రెడ్‌క్రాస్‌ రక్తదానం విషయంలో విస్తృత అవగాహన చేపడుతోంది. అవగాహన ఉన్నవారు మాత్రమే దానం చేస్తున్నారు. కొత్తవారు రావడం లేదు. రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు పోవాలి. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి.

-ప్రసాదరావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌, విజయనగరం

Updated Date - Sep 20 , 2025 | 12:07 AM