Burglars in the Civil Supplies Department పౌరసరఫరాలశాఖలో ఇంటి దొంగలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:22 AM
Burglars in the Civil Supplies Department ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. రాజాంలో తాజాగా వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. స్థానిక పౌరసరఫరాల గోదాము నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.25 లక్షల విలువైన రేషన్ సరుకులు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. తహసీల్దార్‌కు ఫిర్యాదు అందడంతో ఇప్పటివరకూ జరిగిన తతంగం బయటపడింది.
పౌరసరఫరాలశాఖలో ఇంటి దొంగలు
రూ.25 లక్షల సరుకులు పక్కదారి!
మద్యం మత్తులో గోదాం ఇన్‌చార్జి
ఇదే అదునుగా చేతికి పనిచెప్పిన సిబ్బంది
రాజాంలో వెలుగుచూసిన వ్యవహారం
ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. రాజాంలో తాజాగా వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. స్థానిక పౌరసరఫరాల గోదాము నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.25 లక్షల విలువైన రేషన్ సరుకులు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. తహసీల్దార్‌కు ఫిర్యాదు అందడంతో ఇప్పటివరకూ జరిగిన తతంగం బయటపడింది.
రాజాం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):
సంతకవిటితో పాటు రాజాం మండలంలో 136 రేషన్ డిపోలకు నిత్యావసరాలు అందించే పౌరసరఫరాల శాఖ గోదాం (స్టాక్ పాయింట్) రాజాంలో ఉంది. ఆరు నెలలుగా ఇక్కడ శ్రీనివాసరావు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన నిత్యం మద్యం తాగి విధులకు హాజరవుతారని ప్రచారం ఉంది. ఇటీవల సంతకవిటి నుంచి గంగాభవానికి ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించారు. శ్రీనివాసరావును తిరిగి తహసీల్దారు కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలో రెండురోజులుగా గంగాభవాని గోదాం వద్దకు వస్తున్నా ఇన్‌చార్జి శ్రీనివాసరావు బాధ్యతలు అప్పగించేందుకు రావడం లేదు. దీంతో ఆమె తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ తహసీల్దారును బుధవారం పంపించారు. అయినా శ్రీనివాసరావు రాలేదు. ఆయన వస్తున్న క్రమంలో మార్గమధ్యలో మద్యం తాగి ఓ చోట నిద్రకు ఉపక్రమించినట్టు తెలుసుకున్న అధికారులు విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరింత లోతైన విచారణ చేపట్టగా రూ.25 లక్షల సరుకులు పక్కదారి పట్టిన విషయం గుర్తించారు.
పనిచేయాలంటే హడలే..
కొంతకాలంగా రాజాం పౌరసరఫరాల శాఖ గోదాముపై ఫిర్యాదులున్నాయి. ఇక్కడి నుంచి డిపోలకు ఇచ్చే బియ్యంలో కూడా తరుగు వస్తోంది. దిగువస్థాయి సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఇక్కడ పనిచేసే ఇన్‌చార్జులపై నెలకు రూ.40 వేల వరకూ అపరాధ రుసుం పడుతుండడంతో ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే శ్రీనివాసరావు ఆరు నెలల కిందట రాగా ఆయన మత్తులో ఉన్నప్పుడు సిబ్బంది కొంతమంది డీలర్లతో కుమ్మకై డిపో నుంచి సరుకులు అక్రమంగా తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి 560 బస్తాల బియ్యం, 19 బస్తాల పంచదార, 10 బస్తాల కందిపప్పు, 388 నూనె ప్యాకెట్లు, మూడు కిలోల సన్నబియ్యం ప్యాకెట్లు 108 మాయం చేసినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
పౌరసరఫరాల శాఖ గోదాం ఇన్‌చార్జిపై ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే కొత్తగా సంతకవిటి డీటీ గంగాభవానిని ఇక్కడ నియమించాం. చార్జ్ ఇవ్వకుండా శ్రీనివాసరావు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై గంగాభవాని స్వయంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు ఎంఎల్‌ఎస్ పాయింట్ తాళాలు తీయని విషయం కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలపై డీటీ ప్రకాష్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. గోదాం ఇన్‌చార్జి మద్యం మత్తులో ఉండగా రేషన్ పక్కదారి పట్టినట్టు ప్రాథమికంగా గుర్తించాం. ఉన్నతాధికారులకు తెలియజేశాం.
- ఎం.రాజశేఖర్, తహసీల్దారు, రాజాం