మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:26 PM
డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు సన్న బియ్యం అందించినట్లు డీఆర్వో కె.హేమలత తెలిపారు.
-జిల్లాలోని పాఠశాలలకు 19,741 బస్తాల పంపిణీ
- డీఆర్వో హేమలత
బెలగాం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు సన్న బియ్యం అందించినట్లు డీఆర్వో కె.హేమలత తెలిపారు. ఈ బియ్యాన్నే వండి విద్యార్థులకు భోజనం పెట్టాలని అన్నారు. గురువారం స్థానిక డీవీఎంఎం పాఠశాలలో విద్యాశాఖాధికారులతో కలిసి డీఆర్వో సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 1,503 పాఠశాలలకు 5,184 బస్తాలు, 150 వసతి గృహాలకు 13,456 బస్తాల ఫోర్టీఫైడ్ సన్న బియ్యాన్ని (ఒక్కో బస్తా 25 కేజీలు) పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతి బస్తాపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందన్నారు. దాన్ని స్కాన్ చేయగానే బియ్యం ఏ సీజనులో పండింది, ఎక్కడ నుంచి వచ్చిందని, ఏ రకం బియ్యం తదితర వివరాలు అన్ని తెలుస్తాయని అన్నారు. దీనివల్ల ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు. జిల్లాకు పాలకొండలోని వెంకటేశ్వర రైస్ మిల్ నుంచి బియ్యం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.