Share News

Bribe for house plan ఇంటి ప్లాన్‌కు లంచం

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:47 PM

Bribe for house plan నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్‌ ఎ.తారక్‌నాథ్‌ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టణంలోని పద్మశాలివీధిలో నివశిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ అనుమతి కోసం లంచం డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో తన గదిలో రూ.15వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Bribe for house plan ఇంటి ప్లాన్‌కు లంచం
ఏసీబీకి చిక్కిన కమిషనర్‌ తారక్‌నాథ్‌

ఇంటి ప్లాన్‌కు లంచం

అనుమతి ఇచ్చేందుకు రూ.20వేలు డిమాండ్‌

ఏసీబీకి చిక్కిన నెల్లిమర్ల కమిషనర్‌

రూ.15వేలు తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా..

నెల్లిమర్ల, జూలై 15(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్‌ ఎ.తారక్‌నాథ్‌ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టణంలోని పద్మశాలివీధిలో నివశిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ అనుమతి కోసం లంచం డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో తన గదిలో రూ.15వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని పద్మశాలివీధిలో నివశిస్తున్న బురడి మహేష్‌ అదే వీధిలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఆ ఇంటికి ప్లాన్‌ అనుమతి కోసం ఇటీవల పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం కమిషనర్‌ తారక్‌నాథ్‌ను సంప్రదించాడు. అనుమతి కావాలంటే రూ.20వేలు లంచం ఇవ్వాలని కమిషనర్‌ డిమాండ్‌ చేశారు. రూ.15వేలు నగదు రూపంలో మిగిలిన రూ.5వేలు దివాన్‌ కాట్‌ బెడ్‌ కోసం ఇవ్వాలని కోరారు. ప్లాన్‌ కోసం అవసరమైన ఫీజు చెల్లించానని, లంచం ఇవ్వలేనని మహేష్‌ ప్రాధేయపడ్డాడు. అయినా సరే కమిషనర్‌ అంగీకరించలేదు. దీంతో మహేష్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నగర పంచాయతీ కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్‌కు వెళ్లిన మహేష్‌ రూ.15వేలు అందజేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్‌ హ్యేండెడ్‌గా కమిషనర్‌ తారక్‌నాథ్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేశామని, బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.

ఆది నుంచీ ఆయనపై ఆరోపణలు

నగర పంచాయతీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తారక్‌నాథ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రతి భవనం వద్దకు వెళ్లి లంచాలు డిమాండ్‌ చేస్తునట్లు విమర్శలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గత మూడు దఫాలుగా జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో బాధితులతోనే నేరుగా సమావేశాల్లో చెప్పించారు. అయినా సరే కమిషనర్‌ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరుకు ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jul 15 , 2025 | 11:47 PM