‘Bow-Bow’.. Biting Everywhere! ‘భౌ’బోయ్.. కరిచేస్తున్నాయ్!
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:07 AM
‘Bow-Bow’.. Biting Everywhere! జిల్లా కేంద్రవాసులను వీధి కుక్కలు బెంబే లెత్తిస్తున్నాయి చిన్నా, పెద్ద అని తేడా లేకుండా కనిపించిన ప్రతివారిపైనా అవి దాడి చేస్తూ ఆస్పత్రి పాల్జేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని సైతం వెంబడించి.. ప్రమాదాలకు గురయ్యేలా చేస్తున్నాయి.
చిన్నారులు, వృద్ధులపై దాడి
ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులు
కుక్క కాటుకు గురై ఇటీవల ఓ బాలుడు మృతి
భయాందోళనలో ప్రజలు
ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
పార్వతీపురం టౌన్, సెప్టెంబరు6(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రవాసులను వీధి కుక్కలు బెంబే లెత్తిస్తున్నాయి చిన్నా, పెద్ద అని తేడా లేకుండా కనిపించిన ప్రతివారిపైనా అవి దాడి చేస్తూ ఆస్పత్రి పాల్జేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని సైతం వెంబడించి.. ప్రమాదాలకు గురయ్యేలా చేస్తున్నాయి. కొన్ని రోజుల కిందట పట్టణంలోని మణికంఠ కాలనీకి చెందిన ఓ బాలుడు కుక్కకాటుకు గురై మృతి చెందాడు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. కొందరైతే బయటకు రావాలంటేనే హడలెత్తి పోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాకేంద్రం పార్వతీపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ ప్రజలను కాటేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులపై అకస్మాత్తుగా దాడి చేసి గాయాలపాల్జేస్తున్నాయి. వాటి దాడుల్లో క్షతగాత్రులవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. కూలీ పనులు, వాకింగ్, సంబంధిత వ్యాపారాలు చేసుకున్న వారు అధికంగా కుక్క కాటుకు గురవుతున్నారు. నెలకు కనీసం 20 నుంచి 30 వరకు జిల్లా కేంద్రాసుపత్రిలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు.
ఐదేళ్ల కిందట ప్రజారోగ్య, పశుసంవర్థక శాఖలు సంయుక్తంగా కుక్కల దాడులను నివారించేందుకు చర్యలు చేపట్టారు. బ్లూక్రాస్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా సుమారు 600లకు పైగా కుక్కలకు కుటుంబ సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు నిర్వహించారు. దీంతో కొంతవరకు ప్రజలకు శునకాల బెడద తప్పింది. అయితే ఇటీవల కాలంలో మళ్లీ శునకాల సంఖ్య పెరిగింది. 30 వార్డుల్లో దాడులు పునరావృతమవుతున్నాయి. గత ఏడాది కూడా మున్సిపాల్టీలోని వీధుల్లో కుక్కల నివారణకు ప్రజారోగ్యశాఖాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం వీధుల్లో కుక్కలు ఎప్పుడు ఎవరిని కాటేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా పట్టణంలో ఓ బాలుడు కుక్క కాటుకు గురై మృతి చెందిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్రవాసులు కోరుతున్నారు.
బయట తిరగలేకపోతున్నాం..
కుక్కలు దాడులు చేసి ప్రజలను గాయాలపాల్జేయడమే కాకుండా మరణాలకు కారణమవు తున్నాయి. బయట తిరగడం కష్టంగా మారింది. ఇప్పటికైనా బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులతో పాటు కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
- ఆర్‌వీ బాబురావు, కొత్తవలస
======================
పట్టించుకోవడం లేదు..
వీధుల్లో కుక్కల స్వైరవిహారాన్ని ఆపకపోతే పట్టణంలోని మరికొంతమంది చిన్నారులు మృత్యు వాత పడకతప్పదు. శునకాలు గుంపులుగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు ఆరిచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణం.
- ఎన్.గోపి, పార్వతీపురం
======================
ప్రత్యేక చర్యలు
కుక్కల నివారణకు సంబంధించి కలెక్టర్, ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిస్తాం. అనంతరం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో బ్లూక్రాస్ సంస్థ సభ్యులు సహాయ సహకారాలు అందించాలనికోరుతున్నాం. శునకాల కారణంగా జిల్లాకేంద్ర వాసులు ఇబ్బందులు పడకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
- శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్, పార్వతీపురం