Share News

Farmers’ Income రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:19 AM

Boosting Farmers’ Income Is the Goal జిల్లాలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సుపరిపాలనపై బుధవారం రెండో రోజు కలెక్టరేట్‌లో పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, కమిషనర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

 Farmers’ Income రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
కార్య క్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సుపరిపాలనపై బుధవారం రెండో రోజు కలెక్టరేట్‌లో పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, కమిషనర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎంపీడీవోలు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని.. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అమలు చేయాలి. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి దత్తత తీసుకున్న గ్రామాల్లోని రైతుల ఆర్థిక పరిస్థితి మారాలి. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న జీవీవీ స్థాయి నుంచి కనీసం 20 శాతం వృద్ధిని సాధించాలి. ఐటీడీఏ పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గిరిజన ప్రాంతాల్లోని గర్భిణుల మరణాలను నివారించేందుకు బర్త్‌ వెయిటింగ్‌ హాళ్లను ఐటీడీఏ నిర్వహిస్తుంది. మున్సిపాలిటీల పరిధిలో ‘మన వీధి-మన బాధ్యత’ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి. ప్రతి ఇంటి వద్ద ఒక మొక్కను నాటించాలి. ఇందుకు అవసరమైన మొక్కలను అందజేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి మౌలిక వసతులు, మందులు, సిబ్బంది హాజరు వంటి వాటిని పరిశీలించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ ముస్తాబు

‘గిరిజన గ్రామాల్లోనూ ఫ్యామిలీ ముస్తాబు అమలుకు చర్యలు చేపడుతున్నాం. ఎంపీడీవోలు ఇంటింటికీ వెళ్లి.. గిరిపుత్రులకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. గిరిజన కుటుంబా లతో కలిసి భోజనం చేసి వారి అలవాట్లు, సంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిశీలిస్తారు.’ అని కలెక్టర్‌ తెలిపారు.

బాల్య వివాహం జరగరాదు

‘జిల్లాలో వచ్చే ఏడాదిలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకూడదు. ఒకవేళ ఎక్కడైనా జరిగితే అధికారులపై చర్యలు తప్పవు. 10 నుంచి 21 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకుల జాబితా ఆ మండల పరిధిలోని అధికారులు వద్ద సిద్ధంగా ఉండాలి. అనుమతి లేకుండా వివాహం జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌ నడుస్తుంది. సాధ్యమైనంతవరకు ఎటువంటి భూతగాదాలు లేకుండా చూడాలి.గొడవలు జరిగితే పోలీసుల సహకారం తీసుకోవాలి.’ అని కలెక్టర్‌ తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ... బాల్య వివాహాల సమాచారం లేదంటే జిల్లాలో వివాహాలు జరగడం లేదని భావించరాదన్నారు. గ్రామ, మండల స్థాయిలో పటిష్ఠ నిఘా అవసరమన్నారు.

అన్యాయాన్ని ప్రశ్నించాలి

సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా విద్యార్థులు ఎదగాలని, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆడిటో రియంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవాలని, మోసపోతే ఫిర్యాదు చేయాలని తెలిఆపరు. అనంరతం వినియోగదారుల హక్కుల రక్షణలో కృషి చేసిన వారికి అవార్డులు అందించారు.

Updated Date - Dec 25 , 2025 | 12:19 AM