గల్లంతైన మాజీ సర్పంచ్ మృతదేహం లభ్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:42 PM
దుగ్ధసాగ రం వద్ద వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన నెలిపర్తి మాజీ సర్పంచ్ మంచాల రామారావు (45) మృతదేహం విజయ నగరం జిల్లా కొట్టక్కి వద్ద మంగళవారం లభ్యమైంది.
సాలూరు రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దుగ్ధసాగ రం వద్ద వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన నెలిపర్తి మాజీ సర్పంచ్ మంచాల రామారావు (45) మృతదేహం విజయ నగరం జిల్లా కొట్టక్కి వద్ద మంగళవారం లభ్యమైంది. వట్టిగెడ్డ దాటుతూ మాజీ సర్పంచ్ రామారావు గల్లంతైన విషయం పాఠకులకు విధితమే. ఆయన మృతదేహం కోసం పోలీసులు గాలించారు. వరద ఉధృతికి మృతదేహం సరిహద్దు జిల్లా విజయనగరం పరిధిలో కొట్టక్కి సమీపాన లభ్యమైంది. విజయనగరం జిల్లా రామభద్రపురం ఎస్‌ఐ వెలమల ప్రసాద్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఇసుక కోసం నదిలో పెద్ద పెద్ద గోతులు తీయడంతో ఆ ప్రాంతానికి ఈత కొడుతూ వచ్చిన రామారావు వరద ఉధృతికి బలయ్యాడనే అభిప్రాయం దుగ్ధసాగరం గ్రామస్థులు వ్యక్తం చేశారు. రామారావు 14 ఏళ్ల క్రితం నెలిపర్తి పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేసి ప్రజల మన్నన పొందారు. ఆయనకు కొడుకు అనంత్ యోగీశ్వర్, కూతురు శ్రావ్య ఉన్నారు. ఆయన మృతితో పంచాయతీలో విషాదం నెలకొంది.