big line for urea యూరియా కోసం బారులు
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:11 AM
big line for urea జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని అధికారులు ఓవైపు స్పష్టం చేస్తుంటే రాజాంలో మాత్రం రెండు బస్తాల యూరియా కోసం రైతులు ఆరేడు గంటల పాటు క్యూలో బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడితో ఆగకుండా గులికల ప్యాకెట్లు కొంటేనే యూరియా ఇస్తామని అమ్మకందారు మెలిక పెట్టాడు.
యూరియా కోసం బారులు
రాజాంలో గంటల కొద్దీ రైతుల నిరీక్షణ
అందరికీ అందని వైనం
రాజాం రూరల్, జులై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని అధికారులు ఓవైపు స్పష్టం చేస్తుంటే రాజాంలో మాత్రం రెండు బస్తాల యూరియా కోసం రైతులు ఆరేడు గంటల పాటు క్యూలో బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడితో ఆగకుండా గులికల ప్యాకెట్లు కొంటేనే యూరియా ఇస్తామని అమ్మకందారు మెలిక పెట్టాడు. ఈ దుస్థితిపై రాజాంలోని ఓ ఎరువుల దుకాణం వద్ద రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఆరు వందలతో పోవాల్సింది రూ.వెయ్యి ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. వర్షాలతో అన్నదాతలంతా సాగుకు సన్నద్ధమయ్యారు. యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు శనివారం ఇక్కడి చీపురుపల్లి రోడ్‌లోని ఓ ఎరువుల గోదాం వద్దకు ఉదయం ఏడు గంటలకే చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట
కావస్తున్నా రైతులందరికీ ఎరువులు అందకపోవడంతో ఆందోళనకు దిగారు. యూరియా కావాల్సిన రైతులు ఖచ్చితంగా రెండు ప్యాకెట్ల గులికెలు కొనాల్సిందేనని డీలర్ మెలికపెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం రెండు గంటలయ్యేసరికి యూరియా అయిపోవడంతో తీవ్ర నిరాశతో ఇంటబాట పట్టారు.
రెండు బస్తాలు చాలవు
రామినాయుడు, రైతు, పెనుబాక
నాకు పదెకరాల భూమి ఉంది. కేవలం రెండు బస్తాలు మాత్రమే యూరియా ఇస్తున్నారు. ఇది ఏమూలకూ చాలదు. మిగిలిన భూమిని ఎలా సాగు చేయాలి. ఎరువులు కొరతలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటిస్తుంటే ఏడు గంటలు క్యూలో ఉంటే రెండుబస్తాలు యూరియా ఇచ్చారు. సరిపడినంత యూరియా అందుబాటులో ఉంచాలి.
గులికెలు కొంటేనే..
అప్పలనాయుడు, రైతు, కంచరాం.
రెండు గులికెల ప్యాకెట్లు కొంటేనే రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు. వాటిని ఏం చేసుకోవాలి. రూ.600తో సరిపోవాల్సింది రూ. 1000 ఖర్చు అవుతోంది. దీనికితోడు ఆటోల ఖర్చు. ఏడు గంటల పాటు క్యూలో ఉంటేనే యూరియా దొరికింది.
--------------