Share News

Bhogapuram Airport is a lifeline for Uttarandhra భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు ఆయువుపట్టు

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:47 PM

Bhogapuram Airport is a lifeline for Uttarandhra భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే ఆయువుపట్టు అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. నిర్మాణంలో ఉన్న భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన శనివారం పరిశీలించారు.

Bhogapuram Airport is a lifeline for Uttarandhra భోగాపురం ఎయిర్‌పోర్టు   ఉత్తరాంధ్రకు ఆయువుపట్టు
ఎయిర్‌పోర్టు పనులను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు.

భోగాపురం ఎయిర్‌పోర్టు

ఉత్తరాంధ్రకు ఆయువుపట్టు

విమానాశ్రయం పనులు 86 శాతం పూర్తి

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు

భోగాపురం, సెప్టెంబరు13(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే ఆయువుపట్టు అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. నిర్మాణంలో ఉన్న భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగ పడుతుందన్నారు. శరవేగంగా నిర్మాణం జరుగుతోందని, 14 నెలలకు ముందు 26శాతం ఉన్న ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం 86శాతం పూర్తయ్యాయన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రత్యేక చొరవతోనే సాధ్యమైందని చెప్పారు. భారతదేశంలో అనేక ఎయిర్‌పోర్టులు చూశానని, అందమైన ఎయిర్‌పోర్టులలో ఇదే ప్రథమంగా నిలుస్తుందన్నారు. ఈ 14 నెలల్లో 7 సార్లు స్వయంగా పరిశీలించానని, అన్ని పనులు నాణ్యతతో జరుగుతున్నాయని, వర్షాలు పడుతున్నా ఆటంకం కలగలేదన్నారు. ఈఏడాది జూన్‌లోనే ఇక్కడ విమానం ఎగిరే పరీక్ష చేపట్టామన్నారు. గత ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీచ్‌ కారిడార్‌ నమూనా తయారు చేశారని, ఈ ప్రభుత్వం మత్స్యకారులకు, వ్యాపారులకు, తీర ప్రాంత గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా బీచ్‌ కారిడార్‌ నిర్మాణం జరుగుతోందని అన్నారు. జాతీయ రహదారి సమీపంలోని ట్రంపెట్‌ పనులు వచ్చేనెల నుంచి చేపడుతామన్నారు. కేంద్రమంత్రి అంతకుముందు ఎయిర్‌పోర్టు మొత్తం పర్యటించి పనుల నాణ్యతను పరిశీలించారు. కొద్దిసేపు సమీక్షించారు. ఆయన వెంట ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు, కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, ఆర్డీవో దాట్ల కీర్తి, తహసీల్దార్‌ రమణమ్మ, జీఎంఆర్‌ ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:47 PM