Share News

Better Medical Care మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:13 AM

Better Medical Care Should Be Provided విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలు హాస్టళ్ల విద్యార్థులను శుక్రవారం పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Better Medical Care     మెరుగైన వైద్యం అందించాలి
సాలూరు ఆసుపత్రిలో విద్యార్థుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి సంధ్యారాణి

  • సాలూరు ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులకు పరామర్శ

సాలూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలు హాస్టళ్ల విద్యార్థులను శుక్రవారం పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మె వల్ల ఆరు హాస్టళ్ల నుంచి సాలూరు ఆసుపత్రికి విద్యార్థులు వచ్చారన్నారు. వారిలో ఒక సోషల్‌ వెల్ఫేర్‌, నాలుగు గిరిజన హాస్టళ్లు, కేజీబీవీకి చెందిన 21 మంది ఉన్నారని వెల్లడించారు. వారెవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. విద్యార్థుల్లో ఒకరు జాండీస్‌, మరొకరు మలేరియా లక్షణాలతో బాధపడుతున్నారని, మిగతా వారు రక్తహీనత, గాయాలు, వైరల్‌ ఫీవర్లకు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారు పూర్తిగా కోలుకునేంతవరకు వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని, చిన్నారులు డిశ్చార్జి అయ్యేంతవరకు జాగ్రత్తగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఆహారం నాణ్యత, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత , వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అంశాలపై పూర్తిస్థాయి సమీక్ష చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మీనాక్షి, టీడీపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:13 AM