Share News

best performance in jee advanced జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటారు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:00 AM

best performance in jee advanced జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. దేశంలో ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

best performance in jee advanced జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటారు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటారు

జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

బొబ్బిలి/రామభద్రపురం/గజపతినగరం/రేగిడి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. దేశంలో ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ కాన్పూర్‌ సోమవారం ఉదయం 10 గంటల తర్వాత ర్యాంకులను ప్రకటించింది. బొబ్బిలి నాయుడు కాలనీకి చెందిన పొట్నూరు కార్తీక్‌ ఆలిండియా స్థాయిలో 419వ ర్యాంకు సాధించాడు. తండ్రి కాళీ రాంప్రసాద్‌ వ్యాపారి కాగా తల్లి కుమారి గృహిణి. ఈసీఈ చేసి సొంతంగా స్టార్ట్‌ప్‌ కంపెనీ స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్తీక్‌ చెప్పారు. బొబ్బిలికి చెందిన పీతల టీనుఆనంద చక్రవర్తి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 118 ర్యాంక్‌ సాధించాడు. తండ్రి పీతల శ్రీనివాసరావు బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి అనూరాధ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.

284వ ర్యాంకు సాధించిన యోగేశ్వర్‌

రామభద్రపురం మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన జాగాన యోగేశ్వర్‌ 284వ ర్యాంకు సాధించాడు. గతంలో జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా స్థాయిలో 853వ ర్యాంకు పొందాడు. తండ్రి సాలూరు సత్యసాయి జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా, తల్లి ఎర్రయ్యమ్మ ఒక ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తున్నారు. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజనీర్‌ చదవాలనుకుంటున్నట్టు యోగేశ్వర్‌ తెలిపాడు.

రొంగళి కార్తీక్‌కు 526వ ర్యాంక్‌

మెంటాడ మండలం పిట్టాడ గ్రామానికి చెందిన రొంగళి కార్తీక్‌ ఆల్‌ ఇండియా స్థాయిలో 526వ ర్యాంక్‌ పొందారు. తల్లిదండ్రులు మురళీ సత్యన్నారాయణ, సత్యవతి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో నివాసం ఉంటున్నారు. సివిల్స్‌కు వెళ్లాలన్నదే కార్తీక్‌ లక్ష్యమని వారు తెలిపారు.

హిమబిందుకు 1390వ ర్యాంక్‌

గజపతినగరం మండలంలోని పురిటిపెంట న్యూకాలనీకి చెందిన నంగిరెడ్ల హిమబిందుకు 1390వ ర్యాంకు వచ్చింది. తండ్రి పురుషోత్తమనాయుడు వ్యవసాయం చేస్తుండగా తల్లి మంగమ్మ గృహిణి.

పవన్‌కుమార్‌నాయుడుకు 750వ ర్యాంకు

రేగిడి మండలం కందిశ గ్రామానికి చెందిన మీసాల పవన్‌కుమార్‌నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 750వ ర్యాంకు సాధించాడు. తండ్రి ఆ గ్రామంలో పోస్ట్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కాగా వీరిలో చిన్నబ్బాయి పవన్‌కుమార్‌నాయుడు.

------------------

Updated Date - Jun 03 , 2025 | 12:00 AM