పంటల బీమాతో ప్రయోజనం
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:40 PM
రైతులు తమ పంటలకు బీమా చేయించుకోవాలని, దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రైతులు తమ పంటలకు బీమా చేయించుకోవాలని, దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఆదివారం వ్యవసాయశాఖాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. బీమాపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చేరడానికి రైతులందరూ అర్హులన్నారు. వరి పంట బీమాకు ఆగస్టు 15లోగా, మొక్కజొన్న, పత్తి, అరటి బీమాకు ఈ నెల31లోగా ప్రీమియం చెల్లించాలన్నారు. వరికి సంబంధించి ఎకరాకు రూ.40 వేలు ప్రీమియం చెల్లించాలన్నారు. ఇందులో రైతులు తమ వాటాగా రూ.800 చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మొక్కజొన్నకు ఎకరాకు రూ.33 వేలు ప్రీమియం కాగా, రైతు వాటా కింద రూ.330, పత్తికి ఎకరాకు రూ.1923 ప్రీమియం కాగా, రైతు వాటా కింద రూ.98, అరటి పంటకు రూ.3,036 ప్రీమియం కాగా, రైతు వాటా కింద రూ.152 చెల్లించాలని అన్నారు. రైతులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ సూచించారు. పంట వేసిన ధ్రువపత్రం జారీ నిమిత్తం కూడా ఎటువంటి మొత్తాన్ని రైతు సేవా కేంద్ర స్బిందికి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు రైతు సేవా కేంద్రం, వ్యవసాయ, ఉద్యానవన కార్యాలయాలను (9951142337, 7065 14447) సంప్రదించాలని సూచించారు.