ముహూర్తం ఖరారు కాకముందే...
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:09 AM
స్థానిక సమరానికి ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినా.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది.
-పల్లెల్లో ప్రారంభమైన స్థానిక ఎన్నికల వేడి
- పోటీకి సన్నద్ధమవుతున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు
-ఒక్కో పంచాయతీ నుంచి నలుగురైదుగురు ..
-బీజేపీ, జనసేనలోనూ ఆశావహులు
-ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం ప్రదక్షిణలు
పార్వతీపురం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక సమరానికి ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినా.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలో ఎంతోమంది ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు పోటీకి సై అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమంటున్నారు. ఒక్కో పంచాయతీ నుంచి నలుగు రైదుగురు చొప్పున టీడీపీ నాయకులు సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ, జనసేన నుంచి కూడా మరికొందరు బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పంచాయతీల్లో సర్పంచ్ పదవి ఎంతో కీలకం. దీంతో ఈ పదవి కోసం అనేక మంది గ్రామస్థాయి నాయకులు అధిష్ఠానం ఆశీస్సుల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ తమకు అభయం ఇచ్చిందని చెప్పుకుంటూ.. మరికొందరు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా పంచాయతీ సర్పంచ్ పదవికి టీడీపీ నాయకుల్లోనే గట్టి పోటీ కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు టీడీపీ నాయకులెవరూ ముందుకు రాలేదు. కనీసం నామినేషన్ కూడా వేయలేదు. జిల్లాలో అతి తక్కువ మంది మాత్రమే పోటీలో నిలబడ్డారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ మద్దతుదారులకు సర్పంచ్ పదవులు రాకుండా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లారు. దీంతో జిల్లాలోని అత్యధిక పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలు పొందారు. కాగా అప్పట్లో నామినేషన్ వేసేందుకు ముందుకు రాని కొంతమంది టీడీపీ పార్టీ నాయకులు ఇప్పుడు పోటీకి సిద్ధపడుతున్నారు.
ఏకగ్రీవం అవుతాయా?
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏకగ్రీవం అయితే పంచాయతీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక నిధులు అందుతాయి. ఆ మొత్తంతో గ్రామాలను అభివృద్ధి చేసుకునే వీలుంది. ఇకపోతే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల విజయం కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంతోమంది కృషి చేశారు. అయితే వారిలో కొంతమంది ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఎవరికి తమ మద్దతు ఇవ్వాలా? అనేది ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్షగా మారింది. పార్టీ మద్దతుదారుల్లో ఎవరిని దూరంగా పెట్టుకున్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుంది. దీంతో స్థానిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటా రన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.