Before the Procurement … ధాన్యం కొనుగోలుకు ముందే..
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:10 AM
Before the Procurement of Grain… ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ముందుగా అధికారులు రైస్ మిల్లులను పరిశీలిస్తున్నారు. అన్నదాతలకు ఏ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం జిల్లాలోని 196 రైస్ మిల్లులను పరిశీలించారు. మిషనరీతో పాటు అవసరమైన సౌకర్యాలు ఏ మేర ఉన్నాయన్న దానిపై ఆరా తీశారు.
ఖరీఫ్ రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
అవకతవకలకు ఆస్కారం లేకుండా నిఘా
కదిలిన అధికారులు
గరుగుబిల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ముందుగా అధికారులు రైస్ మిల్లులను పరిశీలిస్తున్నారు. అన్నదాతలకు ఏ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం జిల్లాలోని 196 రైస్ మిల్లులను పరిశీలించారు. మిషనరీతో పాటు అవసరమైన సౌకర్యాలు ఏ మేర ఉన్నాయన్న దానిపై ఆరా తీశారు. అవకత వకలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు ఎంతమేర విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారన్న దానిపై విద్యుత్‌శాఖ అధికారులు వివరాలు సేకరి స్తున్నారు. కాగా మిల్లింగ్ చేసే సమయంలో కల్తీకి ఆస్కారం లేకుండా నిఘా ఏర్పాటు చేయను న్నారు. మిల్లుల పరిధిలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
వాస్తవంగా ఈ ఏడాది జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అధికారులు అంచనా వేశారు. ఇందుకు అవసరమైన రవాణా, హమాలీలు, గోనె సంచులతో పాటు ఎంతమేర సామగ్రి అవసరం ఉందన్న దానిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రైతుసేవా కేంద్రాల పరిధిలో పీపీసీల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. కేంద్రాల పరిధిలో కొనుగోలుకు షెడ్యూలింగ్ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యానికి సంబంధించి 17 శాతంలోపు తేమ శాతం ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొత్తంగా గతంలో నెలకొన్న సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ధర నిర్ణయించింది. సాధారణ రకం క్వింటాకు రూ. 2,369, గ్రేడ్-ఏ రకానికి రూ. 2,389గా ప్రకటించింది.
సిబ్బంది కేటాయింపు
ధాన్యం కొనుగోలుకు సంబంధించి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. తహసీల్దార్, వ్యవసాయాధికారి, పౌర సరఫరాల ఉప తహసీల్దార్, ప్రతి మిల్లుకు కస్టోడియన్ అధికారులుగా వీఆర్‌వో, కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్లును నియమించనున్నారు.
నిబంధనల మేరకు కొనుగోలు
‘ప్రభుత్వ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులకు అసౌకర్యం కలగకుండా మిల్లులను పరిశీలిస్తున్నాం. వాటి నివేది కలను జిల్లా అధికారులకు అందిస్తాం. కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.’ అని పౌర సరఫరాల విభాగం ఉప తహసీల్దార్ మారుతీరావు తెలిపారు.