Share News

బెడ్లు 150.. రోగులు 249

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:38 PM

Beds: 150.. Patients: 249 పేరుకే పెద్దాసుపత్రి.. కానీ అక్కడకు వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయి మూడేళ్లు గడుస్తున్నా.. పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కొన్ని విభాగాల్లో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఓపీ నమోదు రోగుల సహనానికి పరీక్ష పెడుతోంది.

బెడ్లు 150.. రోగులు 249
జిల్లా కేంద్రాసుపత్రిలో రోగులు ఇలా..

  • అప్‌గ్రేడ్‌ అయి మూడేళ్లు.. మెరుగుపడని సౌకర్యాలు

  • వేధిస్తున్న వైద్య నిపుణులు, సిబ్బంది కొరత

  • రోగులకు తప్పని ఇబ్బందులు

బెలగాం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పేరుకే పెద్దాసుపత్రి.. కానీ అక్కడకు వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయి మూడేళ్లు గడుస్తున్నా.. పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కొన్ని విభాగాల్లో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఓపీ నమోదు రోగుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఆసుపత్రిలో మౌలిక వసతులు లేకపోవడంతో రోగుల బంధువులు, సహాయకులు ఆరుబయటే నిరీక్షించాల్సి వస్తోంది. కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఆసుపత్రిని సందర్శించగా అప్పటికే వైద్యులంతా హాజరయ్యారు. ఇక్కడ 150 బెడ్లు ఉండగా 249 మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. ఓపీ సుమారు 350 వరకూ నమోదైంది. కాగా ఆసుపత్రిలో తలసేమియా డే కేర్‌ సెంటర్‌ వార్డుకు తాళం వేసి ఉంది. ఐసోలేషన్‌ వార్డులో మరుగుదొడ్లు వినియోగంలో లేవు. బయట ఉన్న మరుగుదొడ్లును రోగులు వినియోగించుకోవాలని ఆసుపత్రి సిబ్బంది సూచించినట్లు తెలిసింది. ఐసోలేషన్‌ వార్డులో బెడ్లు అధ్వానంగా ఉన్నాయి. సికిల్‌ సెల్‌ అనీమియా బాధితులు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనపడ్డాయి. ఆసుపత్రి రీ మోడలింగ్‌ కోసం తెచ్చిన టైల్స్‌ మూలన పడి ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు.

ఓపీ కష్టాలు

జిల్లా కేంద్రాసుపత్రికి రోజూ ఓపీ కోసం అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే కచ్చితంగా వారికి ఆధార్‌ లింక్‌ ఉన్న ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ ఉంటేనే ఆసుపత్రిలో ఓపీ నమోదు అవుతుంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కొందరికి ఫోన్‌ ఉండడం లేదు. మరికొంతమందికి ఆధార్‌ లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు ఓపీ నమోదుకు దాదాపు 7-10 నిమిషాలు పడుతుండడంతో ఆ ప్రాంగణం రద్దీగా మారుతోంది.

ఇవీ సమస్యలు..

- ఆసుపత్రి ఆవరణలో రోగుల బంధువులు, సహాయకులు కూర్చోవడానికి బెంచీలు, కుర్చీలు లేవు. దీంతో వారు గేట్‌ బయట, చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

- శానిటేషన్‌ అంతంత మాత్రంగానే ఉంది. రోగులు, రోగుల బంధులపై సెక్యూరిటీ సిబ్బంది సరైన రీతిలో స్పందించడం లేదని ఆరోపణలున్నాయి.

- రక్త నిధి ఉన్నప్పటికీ డోనర్‌ తీసుకొస్తేనే రక్తం ఇస్తామని సిబ్బంది చెబుతున్నట్లు రోగులు వాపోతున్నారు.

- వీల్‌ చైర్లు ఉన్నా అవసరమైన రోగులకు అందించడం లేదు.

- ఫోరెన్సిక్‌, మైక్రో బయోలజిస్ట్‌, సైకార్డియాజిస్ట్‌ తదితర పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఐదుగురు లాబ్‌ టెక్నీషియన్లు , 43 మంది స్టాఫ్‌ నర్సులు ఉన్నారు.

- గుండె సంబంధిత వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

సిబ్బంది నిర్లక్ష్యం

ఏదో గుర్తుతెలియని క్రిమికీటకం కుట్టడంతో అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చాను. వెంటనే చికిత్స అందించారు. ఉదయం డాక్టర్‌ పరీక్షించి డిశ్చార్జ్‌ చేసేస్తామన్నారు. అయితే డాక్టర్‌ వెళ్లి చాలా సమయమైనా డిశ్చార్జ్‌ చేయలేదు. దీనిపై వైద్య సిబ్బందిని అడిగితే పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

- మడ్డి భాస్కర్‌, కొత్తపట్నం

===============================

కిడ్నీ సమస్యతో వచ్చా...

కిడ్ని సమస్యతో వచ్చా. డయాలసిస్‌ చికిత్స అందిస్తున్నారు. వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయాలని వైద్యులు చెప్పారు. అందుకే సోమవారం వచ్చి ఆసుపత్రిలోనే ఉంటున్నాను. ఇక్కడ వైద్యం బాగానే అందిస్తున్నారు.

- ఎం.కృష్ణ, అంటివలస

===============================

ఇంకా కోలుకోలేదు..

కాళ్లు వాపులు, కడుపు ఉబ్బరం సమస్యతో ఆసుపత్రిలో రెండు రోజుల కిందట చేరాను. అంతకముందు గుమ్మలక్ష్మీపురం ఆసుపత్రికి వెళ్లాను. వాళ్లు జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు.

- బిడ్డిక శివకుమార్‌, దర్శిగూడె

===============================

సిబ్బంది కొరత వాస్తవమే..

ఆసుపత్రిలో 150 బెడ్‌లకు సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. రోజూ 200 మందికి పైగా రోగులు ఆసుపత్రిలో ఉంటారు. వారికి సేవలందించేందుకు సరిపడా సిబ్బంది అయితే లేరు. ఇప్పుడు మలేరియా, సీజనల్‌ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా లేరు. వైరల్‌ ఫీవర్స్‌తో అత్యధికులు చేరు తున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుంది.

- కె.శ్యామల, ఆర్‌ఎంవో, జిల్లా కేంద్రాసుపత్రి

Updated Date - Mar 14 , 2025 | 11:38 PM