Share News

Beach on the sand ఇసుకపై పెత్తనం

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:56 PM

Beach on the sand ఇసుక సేకరణలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో కొందరు వ్యక్తులు అక్రమ వ్యాపార సామ్రాజ్యం నిర్మించేశారు. నదుల చెంత ఉన్న వారు ఇసుకను ఉచితంగా పొందవచ్చునని ప్రభుత్వం చెబితే నదిని ఆక్రమించేసి... నచ్చిన చోటల్లా ఇసుకను తవ్వేసి... ఓ చోట పోగేసి.. ధరను నిర్ణయించేసి ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అడిగితే ఇక్కడివారమేనని, ఓ రైతు ఇంటి కోసం ఇసుకను సేకరిస్తున్నామని బొంకుతున్నారు. అసలు విషయం వేరే ఉంది. ఇసుకతో బడా వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.2లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారి దందాకు గోస్తనీ నది రూపురేఖల్లేకుండా పోతోంది.

Beach on the sand ఇసుకపై పెత్తనం
మామిడిపల్లి వద్ద గోస్తనీ తీరంలో అమ్మేందుకు సిద్ధం చేసిన ఇసుక పోగులు

ఇసుకపై పెత్తనం

నదిలో నుంచి సేకరించి.. ట్రాక్టర్లకు విక్రయించి

గోస్తనీలో ఇసుక మాఫియా

రోజుకు రూ.రెండు లక్షల వరకు సంపాదన

పట్టించుకోని అధికారులు

ఎస్‌.కోట రూరల్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

ఇసుక సేకరణలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో కొందరు వ్యక్తులు అక్రమ వ్యాపార సామ్రాజ్యం నిర్మించేశారు. నదుల చెంత ఉన్న వారు ఇసుకను ఉచితంగా పొందవచ్చునని ప్రభుత్వం చెబితే నదిని ఆక్రమించేసి... నచ్చిన చోటల్లా ఇసుకను తవ్వేసి... ఓ చోట పోగేసి.. ధరను నిర్ణయించేసి ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అడిగితే ఇక్కడివారమేనని, ఓ రైతు ఇంటి కోసం ఇసుకను సేకరిస్తున్నామని బొంకుతున్నారు. అసలు విషయం వేరే ఉంది. ఇసుకతో బడా వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.2లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారి దందాకు గోస్తనీ నది రూపురేఖల్లేకుండా పోతోంది.

ఎస్‌.కోట మండలంలోని గోపాలపల్లి, మామిడిపల్లి, వేములాపల్లి, కొట్టాం గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు గడిచిన ఏడాదిగా గోస్తనీలో పెద్దఎత్తున ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో దందా చేస్తున్నారు. ఏ స్థాయిలో అంటే.. నిజంగా ఇసుక కోసం స్థానికులెవరైనా వస్తే కాలు పెట్టనివ్వడం లేదు. తాము చెప్పిన రేటుకు ఇసుక కొనాల్సిందేనంటున్నారు. నాటుబండితో అరునా.. ట్రాక్టర్‌తో అయినా సరే ఇసుక ఉచితంగా రాదని తెగేసి చెబుతున్నారు. అంతగా తమ ముఠాలను నదీ తీరంలో మోహరించారు. ఆ వ్యక్తులతో ఇసుక మాఫియా జతకలవడంతో వీరు ప్రతిరోజు చేస్తున్న ఇసుక వ్యాపారం ఖరీదు అక్షరాలు రెండులక్షల పైమాటే. రోజుకు 200టైరుబళ్లు, 50వరకు ట్రాక్టర్లు ఇక్కడ ఇసుకను వినియోగదారులకు అమ్ముతున్నారంటే ఎంత పెద్ద వ్యాపారం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. వీరి తీరుతో ఇప్పటికే నదీ తీరం అతలాకుతలమవుతోంది. ఊటబావులు దెబ్బతింటున్నాయి. ప్రతిరోజు కలుషిత నీరు ప్రజలు తాగుతున్నారు. వేములాపల్లి వంతెన తీరం దిగువ భాగం క్రమక్రమంగా కుంగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదు. నదీ తీరంలో సాధారణ వ్యక్తులకు ఇసుక దొరకదు. ఎవ్వరూ తీరంలోకి దిగకుండా పెద్దపెద్ద గోతులు తవ్వేశారు. వారు మాత్రం ఇసుకను కూలీల ద్వారా నాటుబళ్లతో సేకరించి ట్రాక్టర్లకు అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ సామాన్యులకు అందకపోగా ఇసుక దొంగలకు వరంగా మారింది. వీరి ఆగడాలను అరికట్టాల్సిన ఆధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఎవరైన ప్రశ్నిస్తే వారిపై తెగబడుతుంటారని స్థానికులు వాపోతున్నారు. ఈ ఇసుక అక్రమ వ్యాపారంపై కొంతమంది సమీప గ్రామాల యువత ఉపముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

Updated Date - Dec 24 , 2025 | 11:56 PM