Share News

బాణసంచాతో తస్మాత్‌ జాగ్రత్త!

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:20 AM

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామవరంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 8న భారీ విస్ఫోటనం జరిగి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

   బాణసంచాతో తస్మాత్‌ జాగ్రత్త!

- బతుకులు బుగ్గిపాలు కానివ్వొద్దు

- అక్రమ నిల్వలపై తనిఖీలు అవసరం

- బహిరంగ అమ్మకాలను నిషేధించాలి

రాజాం రూరల్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామవరంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 8న భారీ విస్ఫోటనం జరిగి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీపావళి పండుగ ఎంతటి ప్రమోదాన్ని కలిగిస్తుందో.. అప్రమత్తంగా లేకుంటే అంతటి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. బాణాసంచా కాల్చడంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలే పోతాయి. ఆస్తినష్టం కూడా భారీగానే ఉంటుంది. బాణసంచా తయారీ మొదలు, నిల్వచేయడం, తరలించడం, విక్రయాలు జరపడం, వాటిని కొనుగోలు చేసి కాల్చడం వరకూ ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాలిస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

అనధికారిక విక్రయాలు..

జిల్లాలోని గుర్ల మండలం దేవునికనపాక పంచాయతీ గవిడిపేట, బాడంగి మండలం ఎరుకలపాకలు, చీపురుపల్లి మండలం పెద నడిపిల్లి లో మాత్రమే బాణసంచా తయారీకి అనుమతులు ఉన్నాయి. ఎస్‌.కోట సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రాన్ని రెన్యువల్‌ చేయాల్సి ఉంది. అయితే, జిల్లాలో అనధికారికంగా అమ్మకాలు చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి గోడౌన్‌లో స్ర్పింకర్లు ఏర్పాటు చేయాలి. నీటిపంపు సెట్లు ఎప్పటికప్పుడు మార్చాలి. అనుకోని ప్రమాదం సంభవిస్తే మంటలను ఆర్పేందుకు కనీస పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. వాస్తవానికి జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితులు కనిపించడం లేదు. పర్మినెంట్‌ షాపుల వద్ద స్ర్పింకర్లు కాదుకదా అగ్నిప్రమాద పరికరాలు కూడా కనిపించడం లేదు. ఇసుక బకెట్లు కూడా లేని పర్మినెంట్‌ గోడౌన్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పరిమితికి మించి మందుగుండు సామగ్రిని నిల్వ చేస్తున్నారు. ఏటా రెన్యువల్‌ చేయించే విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తనిఖీలు నిర్వహించాలి

జిల్లాలో కొంతమంది ముడిసరుకు తెచ్చి, మూడోకంటికి తెలియకుండా అనధికారికంగా బాణసంచా తయారుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అనుమతులు లేకుండా గోడౌన్లలో నిల్వ ఉంచి పండుగలు, పర్వదినాలు, జాతర్ల సమయాల్లో జోరుగా అమ్మకాలు చేస్తున్నారు. గంధకం, సురాకారం తదితర ముడిసరుకు అమ్మకాలు చేసే వ్యాపారులపై కూడా జిల్లా యంత్రాంగం ఓ కన్నేయాల్సి ఉంది. నిబంధనలు అమలు, బాణసంచా నిల్వలు, లైసెన్స్‌ల గడువు, కొనుగోలుకు సంబంధించిన వివరాలు తదితర అంశాలపై జిల్లా విపత్తులు, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు శాఖలు తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో సంఘటనలు..

- గతంలో రాజాం-చీపురుపల్లి రోడ్‌లోని ఓ బాణసంచా గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

- రెండేళ్ల కిందట గుర్ల మండలం దేవునికనపాక సమీపంలో మందుగుండ ఆరబెడుతుండగా గోడౌన్లకు నిప్పు అంటుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- ఐదేళ్ల కిందట బొబ్బిలి తారకరామ కాలనీ సమీపంలో బాణసంచా పేలుడు సంభంచింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

యంత్రాంగం అప్రమత్తం

రామవరం ఘటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 9న అధికారులతో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా అనధికార అమ్మకాలకు లైసెన్స్‌లు ఇవ్వొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కేవలం ముగ్గురు మాత్రమే లైసెన్స్‌లు కలిగి ఉన్నారని, మరో 15 మంది హోల్‌సేల్‌ వ్యాపారులు ఉన్నారని, వారు మాత్రమే అమ్మకాలు సాగించాలని డీఆర్వో శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు.

ఈ నిబంధనలు తప్పనిసరి..

- నివాసాలకు దగ్గరగా తాత్కాలిక, శాశ్వత బాణసంచా విక్రయ షాపుల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు ఇవ్వకూడదు.

- విద్యుత్‌ ట్రాన్ప్‌ఫార్మర్లకు సమీపంలో, హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు కింద దుకాణాలు పెట్టకూడదు.

-ఊరికి ఆవల ఏర్పాటయ్యేలా అధికారులు చూడాలి.

- దుకాణాల మధ్య మూడు మీటర్ల దూరం ఉండేలా చూడాలి.

- పొగ తాగరాదనే బోర్డులు ఏర్పాటు చేయాలి. నీటి సదుపాయం కల్పించాలి.

- డ్రై కెమికల్‌ పౌడర్‌ నాలుగైదు కిలోలు, సీఓటూ (కార్భన్‌ డై ఆక్సైడ్‌) ఐదుదు కిలోలు దుకాణం వద్ద ఉండేలా చూడాలి.

- నిబంధనలకు మించి నిల్వలు ఉంచకూడదు.

- చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదు.

-అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచాలి.

Updated Date - Oct 11 , 2025 | 12:20 AM