Cyber Crimes సైబర్ నేరాలపై అప్రమత్తం
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:20 AM
Be Alert on Cyber Crimes జిల్లా యువత సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా మంచి నడవడికతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. శనివారం జోగింపేట సాంఘిక సంక్షేమ అంబేడ్కర్ గురుకులం ఆవరణలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సంకల్పం అవగాహన సదస్సు నిర్వహించారు.
సీతానగరం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): జిల్లా యువత సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా మంచి నడవడికతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. శనివారం జోగింపేట సాంఘిక సంక్షేమ అంబేడ్కర్ గురుకులం ఆవరణలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సంకల్పం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళా రక్షణ చట్టాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల జోలికి పోవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఆ తర్వాత వీడియో ద్వారా డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తల్లిదండ్రుల కలలు నిజం చేసే విధంగా నడుచుకోవాలని కోరారు. ఈ సదస్సులో ఏఎస్పీ అంకితా సురాన, జిల్లా ఇంటర్మీడియట్ శాఖాధికారి వై.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజారావు, వైద్యాధికారి ఉషారాణి, సీఐ గోవిందరావు, ఎస్‌ఐ ఎం.రాజేష్, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.
టంగుటూరికి ఘన నివాళి
బెలగాం: జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. న్యాయవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రకాశం పంతుల సేవలు ఎనలేనివని ఎస్పీ తెలిపారు. తుపాకీకి ఎదురెళ్లి తెల్ల దొరలను హడలెత్తించిన వ్యక్తి ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.